శ్రీరాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దాంతో ఆగ్రహించిన పరిపూర్ణానంద స్వామి యాత్రకు సిద్ధం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ను హైదరాబాద్ నుంచి పోలీసులు బహిష్కరించారు. మూడు రోజులపాటు గృహనిర్బంధం తరువాత పరిపూర్ణానంద స్వామికి కూడా నగర బహిష్కరణ విధించారు. అయితే, ఈ ఎపిసోడ్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు పరిపూర్ణానంద. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ ను ఆయన క్షమించేస్తున్నా అన్నారు. తను చేసిన పొరపాటును గుర్తించే సమయం కత్తి మహేష్ లో మొదలైందని పరిపూర్ణానంద చెప్పారు. కాబట్టి, మనస్ఫూర్తిగా ఆయన్ని హిందూ సమాజం అక్కున చేర్చుకోవాలని అన్నారు. హిందూ ధర్మం గొప్పతనం అదేనన్నారు.
‘ఆయన గాయపరచారు.. ఒక బోయవాడిగా, గానం చేశారు.. వాల్మీకిగా. వాల్మీకి అంత వ్యక్తి అని నేను చెప్పలేకపోవచ్చు. బోయవాడు లాంటివాడనీ చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి విద్య ఉంది. మేధాసంపత్తి ఉంది. రాముడి గురించి ఆయన సరిగ్గా అర్థం చేసుకుంటే.. రామధర్మాన్ని తెలుసుకుంటే ఆయనా చాలా గొప్ప వ్యక్తి కాగలడు’ అని చెప్పారు. అతి త్వరలో కత్తి మహేష్ కు రాముడి అనుభూతి కలుగుతుందనీ, రామనామం గొప్పతనం తెలియాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. హిందూ సమాజం ఎవర్నీ కొట్టెయ్యాలీ, తిట్టెయ్యాలని చూడదన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనీ, అప్పుడు ఇలాంటి సమస్యలుండవన్నారు. మన విద్యా వ్యవస్థలోని లోపాలే ఇలాంటి సమస్యలకు మూలం అన్నారు. పిల్లలకు లెక్కలూ సైన్సూ నేర్పిస్తారుగానీ.. హిందూధర్మం నేర్పించరని విమర్శించారు. నగర బహిష్కరణ విషయమై పరిపూర్ణానంద స్పందించలేదు. అది కోర్టు పరిధిలో ఉన్న అంశమన్నారు.
దీంతో కత్తి వెర్సెస్ పరిపూర్ణానంద వివాదం దాదాపు ఒక కొలీక్కి వచ్చినట్టే భావించవచ్చు. కత్తిపై ఒంటికాలిపై లేచిన స్వామీజీ.. ఇవాళ్ల పొగడ్తలతో ముంచేయడం గమనించాల్సిన విషయం. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిని.. ఏకంగా రామాయణాన్ని రచించిన వాల్మీకితో పోల్చేయడం గమనార్హం! అయితే, పరిపూర్ణానంద నగర బహిష్కరణను కత్తి వ్యతిరేకించిన సంగతీ తెలిసిందే. ఇలాంటి సున్నితమైన అంశాలను తెగేదాకా లాగకుండా సమస్యను పెద్దది కాకుండా ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదే.