కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద.. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి రెడీ అయిపోయారు. ఏపీలోతో పోలిస్తే.. తెలంగాణలో హిందూత్వ రాజకీయాలకు ఎక్కువ స్కోప్ ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉండటమే కాదు.. ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు కొన్ని… కింది స్థాయి నుంచి బలంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాయి. దాంతో.. తెలంగాణలో బీజేపీకి ఎంతో కొంత స్కోప్ ఉందని.. ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా.. ఆలోచిస్తోంది. అయితే.. సంప్రదాయ రాజకీయ నేతల వల్ల.. ఇప్పటికిప్పుడు అనుకున్నంత మార్పు రాదనుకున్నారేమో కానీ… పరిపూర్ణానందను పార్టీలో చేర్చేసుకున్నారు. ఇప్పటికే ఆయన.. భారత్ టుడే అనే చానల్ పెట్టుకున్నారు. అలాగే.. గతంలో కొన్ని ఆధ్యాత్మికతతో కూడిన రాజకీయ పరమైన సభలు, సమావేశాలు నిర్వహించారు. అవి వర్కవుట్ కావడంతో.. ఇప్పుడు తెరపైకి వచ్చారు.
ఆయనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పోలుస్తూ.. భవిష్యత్ తెలంగాణ సీఎం అంటున్నారు. స్వామి వారు … తనను తాను సర్వసంగ పరిత్యాగిగా చెప్పుకుంటున్నారు. బీజేపీ కోసం పని చేస్తానంటున్నారు కానీ.. ఆయనకి కూడా.. మరో యోగిగా మారాలన్న తాపత్రయం ఎక్కువగానే ఉందని… “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” అనే కార్యక్రమంలో బయటపడిపోయారు. సన్యాసులు అయితే అద్భుతంగా పాలించగలరని.. ఆయన చెప్పుకొచ్చారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రాష్ట్రంలో మార్పు వచ్చిందని తేల్చేశారు. అక్కడకు వెళ్లి తాను చూసొచ్చానన్నారు. గుండా గిరీ తగ్గిందని రిక్షా, ఆటో కార్మికులు తనతో చెప్పారట. దందాలు చేసే వాళ్లు స్వయంగా జైల్లోకి వెళుతున్నారట. దేశానికి మంచి జరగాలన్నదే సన్యాసుల అభిమతమంటున్నారు. ఇలాంటి అభిప్రాయాలు చెప్పిన తర్వాత… తనలాంటి సన్యాసికి పట్టం కట్టాలని..నేరుగా చెప్పాల్సిన పని లేదు. అయినా యూపీలో… స్వామి వారు చెప్పినంతగా.. అంతా హాయిగా ఏమీ లేదు కదా.. ! నేరాల్లో … యూపీ ఇప్పటికి టాప్ పొజిషన్‌కు వెళ్తోంది.
రైతులకు… బకాయిలు అందడం లేదు. అభివృద్ధి అనేదే లేదని.. కేవలం ఏడాదిలోనే యూపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ప్రచారం జరుగుతోంది. ఉపఎ్నకల్లో అవే ఫలితాలు వచ్చాయి కూడా. అయినా సరే… పరిపూర్ణానందకు అక్కడంతా బాగా కనిపిస్తోందంటే.. ఆయన బీజేపీ కళ్లద్దాలను పెట్టుకోవడమే కారణం అనుకోవచ్చు. మొత్తానికి తాను తెలంగాణ సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పుకున్నారు.