గత ఎన్నికలకు ముందు కత్తి మహేష్ తో పాటు హడావుడి చేసి హైదరాబాద్ బహిష్కరణకు గురైన పరిపూర్ణానంద తర్వాత బీజేపీలో చేరాడు. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థినన్నంతగా హడావుడి చేశారు కానీ.. 2018 ఎన్నికల్లో ఆయనను వేలు పెట్టనీయలేదు. దాంతో సైలెంట్ అయిపోయారు. ఇంత కాలం ఏమైపోయారో తెలియదు కానీ హఠాత్తుగా హిందూపురంలో కనిపించడం ప్రారంభించారు. తాను హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు.
హిందూపురం నుంచి పోటీ చేయడానికి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి రెడీ అయ్యారు. ఆయన కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పొత్తు ఉంటే పండగ లేకపోయినా పోటీ చేసి.. తనకు కూడా ప్రజా బలం ఉందని నిరూపించాలని అనుకుంటున్నారు. మీడియాలోనే కనిపిస్తారని సొంత ప్రాంతంలో బలం లేని వాళ్లంటూ కొంత మంది చేస్తున్న నేతల్ని తిప్పి కొట్టాలనుకుంటున్నారు. అయితే పొత్తులో భాగంగా సీట్లు వస్తాయని పరిపూర్ణానంద లాంటి వాళ్లు తెరపైకి వస్తున్నారు.
ఏపీపై బీజేపీ ఆలోచనలేమిటో స్పష్టత లేదు. కానీ.. ఇలాంటి వారు పలు నియోజకవర్గాల్లో తెరపైకి వస్తున్నారు. టీడీపీ మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటోంది. పవన్ కల్యాణ్ తాను బీజేపీతోనూ కలిసే ఉన్నానని చెబుతున్నారు. బీజేపీ కూడా తాము పవన్ తో కలిసే ఉన్నామని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలు తమదైన రాజకీయం చేసుకుంటున్నారు.