మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు డివిజనల్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ఎన్నికలు చెల్లవన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్ తోసి పుచ్చింది. అయితే ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. పోలింగ్ జరిగి కౌంటింగ్ పెండింగ్‌లో ఉన్న పరిషత్ ఎన్నికలపై అనుకూల తీర్పు లభించింది. కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఎన్నికలను వారంలో నిర్వహించారన్న పిటిషన్‌పై సింగిల్ బెంచ్ ఎన్నికలు చెల్లవని తీర్పు చెప్పింది. అయితే ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. విచారణ పూర్తి చేసి ఆగస్టు ఐదో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ రోజు తీర్పు చెప్పింది.
స్థానిక ఎన్నికలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. అయితే నిమ్మగడ్డ తర్వాత ఎస్ఈసీగా వచ్చిన నీలం సహాని ఒక్క వారంలో ఎన్నికలు నిర్వహించేశారు. అయితే బాధ్యతలు చేపట్టిన రోజునే కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఎస్ఈసీ . పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది.
తర్వాత పోలింగ్ యధావిధిగా నిర్వహించారు. డివిజనల్ బెంచ్ సూచనల మేరకు మళ్లీ సింగిల్ జడ్జి దగ్గరకే ఆ పిటిషన్ వచ్చింది. సింగిల్ జడ్డి ధర్మాసనం తన పాత తీర్పునకే కట్టుబడ్డారు. ఎన్నికల నిర్వహణ చెల్లదని తీర్పు చెప్పారు. మళ్లీ నిబంధనల ప్రకారం నాలుగు వారాల సమయం ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలు జరపాలని మే 21వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. తర్వాత ఎస్ఈసీ మళ్లీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. డివిజనల్ బెంచ్ విచారణ జరిపి ఇప్పుడు తీర్పు చెప్పింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ మరికొంతకాలం వివాదం నడిచే అవకాశం . లేకపోతే కౌంటింగ్ తేదీలను ఎస్ఈసీ సహాని ఖరారు చేస్తారు.