పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు .. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం…అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగింది. రాత్రి నుంచి తీర్పు అనుకూలంగా వస్తుందని వైసీపీ నేతలకు సమాచారం వెళ్లింది. ఏర్పాట్లలో ఎక్కడా వెనక్కి తగ్గవద్దని సూచలు కూడా చేశారు.
అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా..ఎక్కడా ఏర్పాట్లు ఆపలేదు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ యధావిధిగా సాగించింది. సిబ్బందికి విధులను కేటాయించించి. మధ్యాహ్నం వరకూ ఎలాంటి తీర్పు వస్తుందని ఇతర పక్షాల్లో సందేహం ఉంది కానీ.. ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి గందరగోళం లేకుండా పనులు కొనసాగించింది. ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం తీర్పు వచ్చింది. అయితే.. ఇక్కడ డివిజన్ బెంచ్ ట్విస్ట్ ఇచ్చింది. పోలింగ్ జరిపినా.. కౌంటింగ్ మాత్రం జరపొద్దని స్పష్టం చేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కౌంటింగ్ చేయరు. సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. మొత్తంగా పరిషత్ ఎన్నికలు వ్యవహారం … జరుగుతాయా.. జరగవా అన్నట్లుగా గందరగోళంగా మారిపోయాయి. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు.. డివిజన్ బెంచ్ తీర్పు భిన్నంగా వచ్చాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించరు. ఈ పరిణామాలన్నింటితో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.