అనంతపురం జిల్లా టీడీపీలో.. వారసుల ఆరంగేట్రం టీడీపీ అధినేతకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడుతున్నాయి. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని.. పరిటాల రవి కుమారుడు.. పరిటాల శ్రీరామ్ ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయన వేరే నియోజకవర్గం అడుగుతున్నారు. పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న బీకే పార్థసారధికి హిందూపురం పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి.. తనకు పెనుకొండ ఇవ్వాలని.. పరిటాల శ్రీరామ్ కోరారు. అయితే.. కుదరలేదు. ఇప్పుడు.. కల్యాణదుర్గం అసెంబ్లీ టిక్కెట్‌ను.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి ఇవ్వడం లేదు. ఆయనకు వయసు పైబడింది. అదే సమయంలో ఆయన కుమారుడిపై పార్టీ వర్గాల్లోనే వ్యతిరేకత ఉంది. దాంతో… ఉన్నం వర్గీయులు కూడా.. ఇతరులకు టిక్కెట్ వద్దని… పరిటాల శ్రీరామ్‌కు అయినా కేటాయించాలని కోరుతున్నారు.
అయితే.. అక్కడ సురేంద్రబాబు అనే మరో నేత పేరును చంద్రబాబు ఖరారు చేశారని చెబుతున్నారు. మరో వైపు.. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి.. తమ కుమారుల రాజకీయ ఆరంగేట్రాన్ని… ఖరారు చేసుకున్నారు. ఒకరికి పార్లమెంట్, మరొకరికి అసెంబ్లీ టిక్కెట్ ను ఖరారు చేసుకున్నారు. దీంతో పరిటాల కుటుంబంపై ఒత్తిడి పెరిగింది. జేసీ కుటుంబం నుంచి వారసులు బరిలోకి వస్తే… వారే సీనియర్లు అవుతారని… శ్రీరామ్‌కు కూడా చాన్సివ్వాలని పట్టుబడుతున్నారు. ఇతర చోట్ల కుదరకపోతే.. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని.. రాప్తాడు నుంచి.. శ్రీరామ్‌కు చాన్సివ్వాలని.. సునీత కోరుతున్నారు. దీని కోసమే అమె అమరావతిలో మకాం వేసి.. ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం.. ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని వివరించి.. పరిటాల సునీతనే పోటీ చేయాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిటాల శ్రీరామ్ అయితే.. మంత్రి పదవి ఇవ్వడ కష్టమవుతుందని.. సునీత అయితే అభ్యంతరాలు రావని చెబుతున్నారు. ఇలాంటి కొన్ని అభ్యంతరాలతో.. పరిటాల శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా.. రారా అన్నది… ఉత్కంఠభరితంగా మారింది. పరిటాల సునీత మాత్రం.. ఈ సారి శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు.