పరిటాల సునీత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. జేసీ బ్రదర్స్ టిడిపి ఎంట్రీ తర్వాత నుంచీ కాస్త హంగామా తగ్గించుకుంటూ వస్తున్న పరిటాల సునీత చాలా అరుదుగానే మీడియా ముందుకు వస్తున్నారు. అది కూడా పరిటాల రవి హత్య గురించి మాట్లాడడానికి మాత్రం అస్సలు ఇష్టపడడం లేదు సునీత. కానీ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం వైఎస్ జగన్ చేస్తుండడంతో…టిడిపిలో ఉన్న పెద్దా, చిన్న నాయకులందరూ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. జగన్‌ని ఎవరి స్టైల్లో వాళ్ళు తిట్టేస్తున్నారు. అఫ్కోర్స్ అంతా కూడా అరిగిపోయిన రికార్డే అనుకోండి. జగన్‌ని తిట్టించడానికి చంద్రబాబుకు అందుబాటులో ఉండే ఆయుధాల్లో ఒకరైన సునీత కూడా ఈ సందర్భంగా మీడియా ముందకు వచ్చారు. అగ్రిగోల్డ్ టాపిక్ వదిలేసి వైఎస్ జగన్‌పైన విమర్శలు చేశారు సునీత. నేను కాని మాట్లాడితే…వాస్తవాలు చెప్తే 16 నెలలు కాదు….జగన్ 16 ఏళ్ళు జైలుకు వెళ్తాడని చెప్పారు సునీత.
పరిటాల సునీత చెప్పబోయే వాస్తవాలు ఏ విషయానికి సంబంధించినవి అయి ఉంటాయి అనే విషయం ఎవరైనా ఊహించొచ్చు. పరిటాల రవి హత్యలో జగన్ హస్తం గురించి మాట్లాడాలి. అదే పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు అనే స్థాయిలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రచారం చేసిన జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పుడు టిడిపిలోనే ఉన్నాడు. అది కూడా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడి స్థానం ఇప్పుడు జేసీది. అలాంటి నేపథ్యంలో పరిటాల సునీత ఏం వాస్తవాలు చెప్తుంది? పరిటాల రవి హత్యలో జేసీ దివాకర్‌రెడ్డి హస్తం లేదు అని చెప్పగలదా? దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పదిమంది చనిపోతే జేసీలపైన ఈగ కూడా వాలకుండా చూసుకున్న చంద్రబాబు ఉండగా జేసీ దివాకర్‌రెడ్డి గురించి పరిటాల సునీత మాట్లాడే ధైర్యం చేస్తుందా? పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు జేసీ దివాకర్రెడ్డినే అని పదేళ్ళపాటు హంగామా చేసి….ఇప్పుడు అదే జేసీ టిడిపిలో జంప్ అవ్వగానే…బాబుకు ఆప్తుడు అవ్వగానే…రవి హత్యకు జేసీకి సంబంధం లేదు అని చెప్తే పరువుపోదా? జేసీది తప్పు లేదు….తప్పంతా జగన్‌దే అని సునీత చెప్తే మాత్రం నమ్మేవాళ్ళు ఉంటారా? రేపు జగన్ కూడా చంద్రబాబుకు క్లోజ్ అయితే పరిటాల రవి హత్యకు..జగన్‌కి కూడా సంబంధం లేదని చెప్తుందేమో అన్న అనుమానాలు రావా? అయినా జగన్‌ని జైలుకు పంపించడం ఎలా అని చెప్పి… చంద్రబాబు అస్తమానం తల బద్ధలు కొట్టుకునే రేంజ్లో ఆలోచిస్తుంటే, టిడిపి నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగన్ ఎప్పుడు జైలుకు వెళతాడా అని వేయికళ్ళతో ఎదురుచూస్తుంటే ……..జగన్‌ని పదహారేళ్ళు జైలుకు పంపించే స్థాయి ‘మాటల’ను సునీత ఎందుకు దాచిపెడుతున్నట్టు? జగన్ జైలుకు వెళ్ళకుండా కాపాడాల్సిన అవసరం పరిటాల సునీతకు ఏంటి?