హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై చర్చ సందర్భంగా మహేష్ సూపర్ డూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు, ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్ – జబర్దస్త్ ప్రస్తావన వచ్చింది. రిషితేశ్వరి కేసుపై వైసీపీ సభ్యురాలు రోజా మాట్లాడుతూ, మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్‌కు పిలిపించుకున్న ఘనత మంత్రులదని, వారి సంస్కారం అక్కడే అర్థమవుతుందని అన్నారు. విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు రిషిత చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు యూనివర్సిటీకి వెళ్ళి ప్రెస్‌మీట్ పెట్టి అరగంటపాటు మీడియాతో మాట్లాడి… శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో పాల్గొనటానికి హడావుడిగా విమానమెక్కి హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. దీనిపై గంటా స్పందిస్తూ, రోజా వ్యాఖ్యలకు స్పందించటానికే ఇబ్బందిగా ఉందని అన్నారు. శ్రీమంతుడు ఆడియో కార్యక్రమంలో పాల్గొన్నది నిజమేనని, ఆ చిత్ర నిర్మాతలు తనకు బాగా కావలసినవారు కావటం, ఆ సినిమా మంచి సందేశాత్మకచిత్రం కావటంతో తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. తానేమీ జబర్దస్త్లాంటి కార్యక్రమాలలో పాల్గొనలేదని పరోక్షంగా రోజాను ఎద్దేవా చేశారు(జబర్దస్త్ కార్యక్రమంలో రోజాయే న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు). విమానాలలో ప్రయాణించటం తప్పేమీ కాదని చెప్పారు.
మరోవైపు మంత్రి పరిటాల సునీత రోజాకు గట్టి చురక అంటించారు. రోజా నాడు టీడీపీలో ఉన్న సమయంలో గ్రామగ్రామానికీ తిరిగి పరిటాల రవి ఫోటోలకు దండలు వేశారని, ఆయనను హత్యచేసింది వైఎస్సేనని ఊరూరూ తిరిగి చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పుడు తాను, తనకొడుకు హత్యారాజకీయాలను చేస్తున్నట్లు ఆరోపించటం విడ్డూరంగా ఉందన్నారు. దీనితో రోజా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది.