రాప్తాడులో జగన్ పర్యటన చూసిన వైసీపీ కేడర్ కాస్త సంతోషపడే ఉంటారు చాలా రోజుల తరువాత తమ నాయకుడిని చూసినందుకు.. ఆ సంతోషాన్ని కొన్ని గంటలు కూడా లేకుండా చేసేసారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత . ఆమె నుండి ఈస్థాయి ధాటిని బహుశా జగన్ కూడా ఊహించి ఉండరేమో! తోపుదుర్తి సోదరుల మీద నమ్మకమో, అభిమానమో , లేదంటే పరిటాల కుటుంబం పట్ల కోపమో ఈరోజు జగన్ రాప్తాడు పర్యటనకు కారణం అయ్యాయి. బయటకు కారణంగా బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పినా తీరా చూస్తే అక్కడ జగన్ పోలీసులపై, చంద్రబాబుపై, పరిటాల కుటుంబంపై తీవ్రమైన విమర్శలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పర్యటన ఎటువంటి అల్లర్లు లేకుండా సజావుగానే సాగింది. అయినా వైసీపీ విమర్శలు చేయడంతో రంగంలోకి దిగిన పరిటాల సునీత హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై కౌంటర్ అటాక్ చేసేసారు. రెండు కుటుంబాల మధ్య గొడవలను కాస్తా ఫ్యాక్షన్ తగాదాలుగా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జగన్ మానుకోవాలని హితవుపలికారు.
“ఏదో వచ్చావా పరామర్శించావా వెళ్ళావా అన్నట్టు ఉండు అంతే తప్ప చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి నీది కాదు పులివెందుల ఎమ్మెల్యే” అంటూ జగన్ ను ఎద్దేవా చేశారు. సెల్ఫీలకు జేజేలు పలికించుకోవడానికే ఇక్కడకు వచ్చావ్ అంటూ జగన్ పై అటాకింగ్ చేసేసారు పరిటాల సునీత. SI స్థాయి వ్యక్తులపై జగన్ విరుచుకుపడటాన్ని తప్పుపట్టడం,పెద్ద స్థాయి ఆఫీసర్లు బాగానే ఉంటారంటూ చిన్న స్థాయి ఉద్యోగులు బలైపోతారు అని చెప్పడం, ఉద్యోగ సాధనలో పోలీసులు పడే కష్టాలను చెప్పడం ద్వారా చిన్న స్థాయి పోలీసు అధికారుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. రెడ్ కార్పెట్ వేసి మీకు ఆహ్వానం పలికిన పోలీసులను జగన్ ఇంత దుర్మార్గంగా మాట్లాడటం సబబు కాదని తెలిపారు. పరామర్శకు వచ్చావా ప్రచారానికి వచ్చావా అంటూ జగన్ ను ప్రశ్నించారు.
“నువ్వు కాదుకదా నీ నాయన వచ్చినా నేను చేయాలనుకుంటే నా రాజకీయాలను చేసుకోగల శక్తి నాకుంది జగన్” అంటూ చెప్పడం ద్వారా తమ కుటుంబ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. పరిటాల రవి బ్రతికి ఉంటే ఎలా మాట్లాడతారో అతని భార్యగా నేను కూడా అంతే స్థాయిలో మాట్లాడగలనని పరోక్షంగా ప్రత్యర్థి పార్టీల నాయకులకు హెచ్చరికలు జారీచేశారు. SI నాతో కాల్ మాట్లాడినట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేస్తావా నేను కాణిపాకం మీద ప్రమాణం చేస్తా అంటూ ఏకంగా జగన్ పై ఛాలెంజ్ విసిరారు. మరోవైపు “తోపు అని చెప్పుకుంటావ్” అంటూ మాజీ ఎమ్మెల్యే తోదుపుర్తి ప్రకాష్ రెడ్డిని తీసిపడేశారు కూడా. ప్రత్యర్థి పార్టీల నాయకుల పర్యటనలను ఆపేసి చేసే రాజకీయాలు తమ అధినాయకుడికి నచ్చవంటూ చెప్పడంతో పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరం అని ఒకవైపు చెప్తూనే అలా అని తన బిడ్డ జోలికి వస్తే ఒక తల్లిగా ఊరుకోనని హెచ్చరికలు కూడా జారీ చేశారు పరిటాల సునీత.