ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తదితర హామీల అమలుకోసం పార్లమెంటు లోపలా బయటా రాష్ట్ర ఎంపిలు ఆందోళనలు చేస్తున్న ఈ సమయంలోనే, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వద్ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు సోమవారం రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
రాష్ట్ర విభజన కారణంగా కేంద్రప్రభుత్వం నియంత్రణలో నడిచే అన్ని ఉన్నత విద్యాసంస్థలు తెలంగాణా రాష్ట్రానికే వెళ్లిపోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాటన్నిటినీ ఏర్పాటుచేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి బిల్లు రూపంలో తీసుకువచ్చి పార్లమెంటు ఆమోదం పొందడానికి రెండేళ్ళు పట్టినప్పటికీ, ఆ హామీని ఏడాది క్రితమే అమలుచేశామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభ సభ్యులకి తెలిపారు.
తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టి. శాశ్విత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అక్కడికి సమీపంలోనే ఉన్న వాసవీ ఇంజనీరింగ్ కాంపస్ భవనాలలో గత విద్యాసంవత్సరం నుంచే ఎన్.ఐ.టి. తరగతులు కూడా మొదలయ్యాయి. దానిలో 900 మంది విద్యార్ధులు చదువుకొంటున్నారు. త్వరలో రెండవ బ్యాచ్ కూడా ప్రారంభం కాబోతోందని మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభ సభ్యులకి తెలిపారు. శాశ్విత భవన సముదాయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 140 ఎకరాలు కేటాయించిందని మంత్రి తెలిపారు. వాటి నిర్మాణం కోసం ఈ ఆర్ధిక సం.బడ్జెటులో కేంద్రప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దం అవుతోందని అది చేతికి రాగానే నిధులు విడుదల చేస్తామని వెంటనే నిర్మాణపనులు మొదలుపెడతామని మంత్రి తెలిపారు.
విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే రాష్ట్రంలో ఆరు ఉన్నత విద్యాసంస్థలని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. అయితే అది చేసినవాటి కంటే అమలుచెయ్యని హామీలనే ప్రతిపక్ష పార్టీలు హైలైట్ చేస్తుండటంతో మోడీ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కేంద్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటే, అది తెదేపాకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య దానితో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా రాష్ట్ర భాజపా నేతలు దూరంగా ఉండిపోతుంటారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రం కోసం చేస్తున్న ఇటువంటి హామీలు అమలు గురించి, అది రాష్ట్రానికి అందిస్తున్న ఇతరత్రా సహాయసహకారాల గురించి వారు గట్టిగా ప్రచారం చేసుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి మరో కారణం అని చెప్పకతప్పదు.