లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దక్షిణాది తన ప్రాధాన్యతను మరింత కోల్పోనుంది. యూపీ, బీహార్ రాష్ట్రాల కన్నా దక్షిణాది అతి తక్కువ లోక్ సభ సీట్లతో ఉంటుంది. మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించిన తరువాత జరిగే తొలి జనగణన తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి.. మహిళా రిజర్వేషన్లను అమలు జరుపుతామని హోమ్ మంత్రి అమిత్ షా లోక్‌సభలో చెప్పారు. దీంతో.. మళ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది.
జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి ఇప్పుడున్నదానికన్నా భారీగా తగ్గుతుంది. దీంతో రెండు రాష్ట్రా లు కలిసి కనీసం ఏడెనిమిది స్థానాలు కోల్పోతాయి. రెండు రాష్ట్రాలకు కలిపి 42 లోక్‌సభ స్థానాలుంటే.. కొత్తగా జరిగే పునర్విభజన తరువాత వాటి సంఖ్య 34కు పడిపోతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉంది. ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుంది.
అయితే పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలనుకుంటున్నారు. అలా అయినా సీట్లు పెరిగే నిష్ఫత్తి చూస్తే దక్షిణాదికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఒక్క యూపీలోనే 140కిపైగా సీట్లు వస్తాయి. అయితే ఈ లెక్కలన్నీ అనధికారికం. నిపుణులు వేసిన అంచనాలే. కేంద్రం ఏం చేయబోతుందనేది తేలాల్సి ఉంది.