హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశం పార్లమెంట్‌ను దూకింది. పార్లమెంట్ ఉభయ సభలలో ఈ అంశం మార్మోగిపోయింది. రాజ్యసభలో ఈ విషయంపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన న్యాయవిచారణ కమిటీలో దళితులకు స్థానం కల్పించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఇతర విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ కమిటీలో దళిత సభ్యుడు కూడా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆరెస్సెస్ భావజాలాన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో రుద్దాలని చూస్తోందని మాయావతి ఆరోపించారు.
మరోవైపు లోక్‌సభలో ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రోహిత్ దళితుడు కాదన్న అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేశారని, అతను దళితుడు కాకుంటే మంత్రులు చేసిన తప్పు ఒప్పవుతుందా అని లోక్ సభలో ప్రశ్నించారు. రోహిత్‌ను హెచ్‌సీయూలో కళాశాల, వసతి గృహంనుంచి దూరంగా ఉంచారని, అతను ఒక టెంట్లో ఉండాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు. రోహిత్ మృతి ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.