మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జి.ఎస్.టి.బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే తెదేపా ఒత్తిడి మేరకు లోక్ సభలో ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉంది. కనుక పార్లమెంటు ఉభయసభలలో అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య చాలా వాడిగా,వేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
జి.ఎస్.టి.బిల్లులో కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విధంగా ఒక్క శాతం అధనపు పన్నుని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకొంది. అలాగే ఈ నూతన పన్ను విధానం కారణంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని మూడు దశలలో భర్తీ చేసేందుకు అంగీకరించింది. ఈ విధానం కారణంగా తలెత్తే అంతరాష్ట్ర వివాదాల పరిష్కారం కోసం జి.ఎస్.టి. కౌన్సిల్ ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. కానీ కాంగ్రెస్ సూచించిన సవరణలనిఒ యధాతధంగా ఆమోదించలేదు కనుక కాంగ్రెస్ ఈ బిల్లుకి అభ్యంతరాలు చెప్పవచ్చు. బహుశః అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకొనేందుకు ఆమె నిన్న వారణాసిలో అనారోగ్యానికి గురైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆమె కోసం ప్రత్యేక విమానాన్ని పంపించారు. కనుక ఈరోజైనా జి.ఎస్.టి.బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందో లేదో చూడాలి. రాజ్యసభలో నేడు ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలియగానే షేర్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఒకవేళ ఈ బిల్లుని రాజ్యసభ ఆమోదించినట్లయితే మళ్ళీ కోలుకోవచ్చు. ఈ బిల్లుని ఇవ్వాళ్ళ ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశ్యంతో భాజపా, తన సభ్యులు అందరికీ విప్ జరీ చేసి అందరూ సభలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఒకవేళ ఈరోజు ఈ బిల్లుకి రాజ్యసభ ఆమోదముద్ర వేసినట్లయితే, వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ నూతన పన్ను విధానం అమలవుతుంది.
ఇక ప్రత్యేక హోదాపై పార్లమెంటు ఉభయసభలలో ఇదివరకు కూడా కొన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ, మారిన పరిస్థితులలో దానిపై నేడు జరిగే చర్చకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏపికి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలనుకొంటున్నట్లు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది కనుక అదే విషయం నేడు స్సభలో చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక హోదా తప్ప మరి దేనికీ అంగీకరించబోమని వైకాపా సభ్యులు వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని ప్రతిపాదిస్తే అప్పుడు తెదేపా సభ్యులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.