సభాస్ధంభనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల రాజకీయాలనుంచి పార్లమెంటు చర్చలు ప్రజాప్రయోజనాలవైపుకి దారిమళ్ళడం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల విశేషం.
అయితే ఎంతో కసరత్తు చేశాకే ఈ మార్పు వచ్చింది. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మూడుదఫాలు అఖిల పక్ష సమావేశాలను నిర్వహించారు.
నాలుగేళ్ళుగా ఉభయ సభలు దేశ సమస్యలను పక్కన పెట్టి పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని ప్రజలు ఈసడించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లే పరిస్థితి ని ఈ సమావేశాల్లో చర్చించి, పార్లమెంటు ఉభయ సభల్లో గొడవ, గందరగోళం ఇలాగే కొనసాగితే ప్రజలు సహించరు అని అన్నిపార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి.
బడ్జెట్ సమావేశాల నుండి పార్లమెంటును స్తంభింపజేయటం మానివేస్తామని ప్రతిపక్షం హామీ ఇచ్చింది. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు తాము ఇచ్చిన హామీకి కట్టుబడి పని చేశాయి.
ఫలితంగా 2016-17 వార్షిక ప్రణాలికపై కూడా చర్చ సజావుగా జరుగుతోంది. రియల్ ఎస్టేట్ బిల్లు, ఆధార్ బిల్లులపై చర్చ జరగటంతోపాటు వాటిని ఆమోదించి చట్ట రూపం ఇచ్చారు. జాతీయ బ్యాంకులకు దాదాపు పదివేల కోట్లరూపాయల కుచ్చు టోపి పెట్టి లండన్‌కు వెళ్లిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మాల్యా మోసాలపై కూడా చర్చ జరిగింది. ఎన్.డి.ఏ ప్రభుత్వం పని తీరుపై కూడా సమీక్ష జరపటంలో ప్రతిపక్షం విజయం సాధించింది. అధికార, ప్రతిపక్షాలు పలు అంశాలపై వాడి,వేడి చర్చ జరిపినా ఉభయ సభలను స్తంభింపజేయకపోవటం ఈ సమావేశాల విశేషం.
దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత వేముల ఆత్మహత్య, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మిక జె.ఎన్.య గొడవలతోపాటు ఇతర పలు ముఖ్యమైన అంశాలపై వేడిగా, లోతుగా చర్చలు జరిపారు.
విజయ మాల్యా పై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి తప్ప అతను మోసం చేసిన దాదాపు పదివేల కోట్ల రూపాయలను ఎలా రాబట్టాలనే అంశంపై ఏ ఒక్కరు మాట్లాడలేదు. విజయ మాల్యా విదేశాలకు వెళ్లిపోయేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం సహకరించిందని ప్రతిపక్షం, మీరు అధికారంలో ఉన్నప్పుడే అతని రుణాలను పునర్వ్యవస్థీకరించారని అధికార పక్షం ఆరోపించుకున్నాయి. యూనివర్సిటీల్లో అలజడులపైనా చర్చలూ అంతే..అవి మళ్ళీ తలఎత్తకుండా ఏమి చేయాలో చర్చకేరాలేదు. అయితే సభాస్తంభనలు అరుపులు కేకలు లేని దశకు మార్పువచ్చింది.
ప్రజలు ఏవగించుకుంటున్నారన్న వాస్తవాన్ని అన్నిపార్టీలూ గుర్తించడమే ఈ మార్పునకు కారణం. ఇందులో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు చొరవ కృషి ప్రశంసనీయం. అన్ని పార్టీలతో తటస్ధపాత్ర నిర్వహించడమే ఆయన విజయానికి మూలం.
ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాలకపక్షం, ప్రతిపక్షాల మధ్య ఒకరినొకరు చూసుకోడానికే ఇష్టపడనంత ద్వేషాలు పెరిగిపోయాయి. ఇక్కడ సభా వ్యవహారాల మంత్రి యనమల ది తటస్ధ పాత్ర కాదు. జగన్ పై వ్యంగ్యంతో ప్రతిపక్షాన్ని గిల్లి వదిలినట్టు కవ్వించే పాత్రనే ఆయన శాసనసభలో పోషిస్తూంటారు.దాదాపు మౌనంగా వుండే బెజిపి కూడా నిన్న సిబిఐ మంత్రంతో జగన్ పాటించిన మొండి వైఖరి కారణంగా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. ఈ నేపధ్యం వల్ల పార్లమెంటులో మాదిరిగా ఎపి అసెంబ్లీలో ఇరు పక్షాలనూ కూర్చోబెట్టిమాట్లాడగల యంత్రాంగమేదీ లేకుండా పోయింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వారసత్వం తప్ప ప్రజా జీవనంతో ప్రత్యక్ష అనుభవాలు లేని జగన్ మొండితనంతో సభా సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో దానిని తిప్పికొట్టడంలో తెలుగుదేశం మొత్తం బృందగానమై అంతకు మించిన సమయాన్ని వృధా చేస్తున్నారు.
సభను సజావుగా నడిపించవలసిన బాధ్యత అధికార పార్టీదేనని తెలుగుదేశం గుర్తించాలి. చొరవ చూపాలి. సభ బయట ఒప్పందం కుదుర్చుకోవాలి. నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడు సాధించిన ఈ ఫలితాన్ని తాను కూడా సాధించాలని చంద్రబాబు అనుకుంటే చాలు. మన సభా తీరు కూడా ఎంతో కొంత మారుతుంది.