మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య కేసులో తమిళనాడులోని వెల్లూరు జైలులో యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఎస్. నళినికి జైలు అధికారులు బుదవారం ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు పెరోల్ మంజూరు చేసారు. తమిళనాడు రాష్ట్ర పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఆమె తండ్రి పి. శంకర నారాయణన్ (92) మరణించడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన కుమార్తెను అనుమతించవలసిందిగా కోరుతూ నళిని తల్లి పద్మావతి పెట్టుకొన్న దరఖాస్తుని మన్నించి జైలు అధికారులు ఆమెకు పెరోల్ మంజూరు చేసారు. శంకర నారాయణన్ అంత్యక్రియలు ఆయన కుమారుడు కొత్తూర్ పురంలో ఈ రోజు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నళిని వస్తున్నందున ఆమెకు మద్దతు తెలిపేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు కూడా బారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది కనుక ఎటువంటి అవాంఛనీయమయిన సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు.