తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురూబాద్లో ప్రారంభించే ముందు చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆగస్టు 15 జెండా పండుగ వేడుకలో ప్రసంగించిన కేసీఆర్ దళితుల్ని పైకి తీసుకు రావడానికి తాము చాలా చేయబోతున్నామని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ… ఆప్రసంగంలో హుజురాబాద్‌లో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా మొత్తం అమలు చేస్తామని ఇతర నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు పాక్షిక అమలు అంటే ఏమిటన్నదానిపై చర్చ ప్రారంభమయింది.
హుజురాబాద్‌లో ఉపఎన్నికల్లో లబ్ది పొందడానికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెబుతున్నారని.. అందుకే తెలంగాణలోని దళిత కుటుంబాలన్నీ కేసీఆర్ తమకూ రూ. పది లక్షలు ఇస్తారని ఆశలు పెట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ చేసిన ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ అంచనాలు అలా పెంచితే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారేమో కానీ…కేసీఆర్ ఇప్పుడు ఆ అంచనాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాక్షికంగా మాత్రమేఅమలు చేయబోతున్నామనే సందేశాలను బయటకు పంపుతున్నారు. పాక్షికం అంటే బహుశా.. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు… నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే ఇవ్వాలనుకున్నారు. హుజూరాబాద్‌లో కూడా వంద మందికి ఇస్తారని అనుకున్నారు.
కానీ ఆ తర్వాత కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. అందరికీ ఇస్తామన్నారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లోనూ ఇస్తామన్న ప్రచారం ఊపందుకుంది. ఓ సందర్భంలో కేసీఆర్ రూ. లక్ష కోట్లయినా ఇస్తామని ప్రకటించడంతో అంచనాలు పెరిగిపోయింది. ఇచ్చేదేదో ఎన్నికలకు ముందే ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. విపక్ష పార్టీలు కూడా అదే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా దళితులు ఆందోళనకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ పెద్దల్లో కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా సీఎస్‌ను కరీంనగర్‌కు పంపి … ప్రకటన చేయించారని చెబుతున్నారు. తర్వాత కేసీఆరే… పాక్షిక అమలు ప్రకటన చేశారు. ఈ పరిణామాలతో దళిత బంధు పథకం అమలు ఉపఎన్నికల తర్వాత అనుమానంలో పడే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి.