ఏడాది చివరన జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని ..బీజేపీ కూడా అంచనా వేసుకుందో… ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోతుందని… తెలుసుకుందో కానీ.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే దిశగా కసరత్తు చివరి దశగా తీసుకొచ్చింది. ఈ మేరకు… లా కమిషన్కు … బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖ కలకలం రేపుతోంది. జమిలి ఎన్నికల అవసరాన్ని నొక్కి చెబుతూ.. ఓ లేఖ రాశారు. అందులో కొన్ని సూచనలు కూడా చేశారు. 2019, 2024లో రెండు విడుతలుగా లోక్సభకు, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటిని బలపరిచేలా.. అమిత్ లేఖలోని అంశాలున్నాయి. జమిలి ఎన్నికల అంశంపై లా కమిషన్ తన నివేదికను కేంద్ర న్యాయశాఖకు సమర్పించనున్నది.
మరోవైపు రెండు విడుతల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను కూడా గతంలోనే ఎన్నికల సంఘం అభిప్రాయం కోసం కేంద్రం పంపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఒకే దేశం.. ఒకే ఎన్నిక సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పిస్తూ 2019లో ప్రారంభమయ్యే విధంగా లోక్సభ, అసెంబ్లీలకు రెండు విడుతల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫారసులను సిద్ధంచేస్తున్నది. లా కమిషన్ నివేదిక ప్రకారం రెండో విడుత జమిలి ఎన్నికలు 2024లో జరిగే అవకాశం ఉన్నది. 2021 వరకు ఎన్నికలు జరుగాల్సి ఉన్న రాష్టాలకు మొదటి దశలో భాగంగా 2019లో ఎన్నికలు నిర్వహించాలని నివేదిక ప్రతిపాదిస్తున్నది.
2019లో మొదటి దశలో ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఒడిషా, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ సహా మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. 2024లో జరుగునున్న రెండో విడుత జమిలి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాలు ఉండనున్నాయి. లోక్సభ ఎన్నికలతోపాటు ఆయా రాష్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించాల్సి లేదా తగ్గించాల్సి ఉంటుంది. దీనికోసం రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి వస్తుంది. దీని కోసం త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడానికి కేంద్రం సిద్ధమవుతోంది.