తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ సానుభూతి పరుల్ని తమ వైపు మళ్లించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ హైకమాండ్.. తెలంగాణ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగింది. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవడం లేదు. టీటీడీపీ అధ్యక్షుడ్ని కూడా ఎన్నికలు అయిన తర్వాతనే నియమించాలని నిర్ణయించారు. దీంతో ఆ పార్టీ సానుభూతిపరుల్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున తెలంగాణలో తమ పార్టీ కి టీడీపీ మద్దతివ్వాలని సోషల్ మీడియాలో జనసైనికులు గట్టి ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన అభ్యర్థుల కూడా చంద్రబాబు ఫోటోను వాడేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ పాజిటివ్ గా ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తులో ఉండటమే కారణం. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి కారణంగా ఈ సారి టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ కు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. నేరుగా టీడీపీ సానుభూతిపరుల మద్దతు ఉందని కాంగ్రెస్ చెప్పుకోవడం లేదు. కానీ.. టీడీపీ సానుభూతిపరులు తీవ్రంగా వ్యతిరేకించే వారిని గట్టిగా ఎదుర్కొంటున్నారన్న ఫీలింగ్ .. రేవంత్ తెప్పిస్తున్నారు. ఆయన అంతర్గత రాజకీయం అలా నడుస్తోంది.
ఇక బీఆర్ఎస్ కూడా టీడీపీ సానుభూతిపరుల ఓట్లకోసం… నాలుగైదు మెట్లు దిగిపోతోంది. ఓ చానల్ ఇంటర్యూలో కేటీఆర్… చాలా పాజిటివ్ గా మాట్లాడారు. బయట కాంగ్రెస్ కు మేలు చేసేలా .. పోటీ నుంచి విరమించుకున్నారని చేసిన ఆరోపణలను రిపీట్ చేయలేదు. చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకం అయ్యాయి. నిజంగా టీడీపీకి ప్రభావితం చేసేంత ఓటు బ్యాంక్ ఇంకా ఉందా లేదా అన్నది తెలియదు కానీ….. ఎన్నికల్లో పాల్గొనకపోయినా టీడీపీనే హాట్ టాపిక్ గా మారుతోంది.