మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్య ఆసక్తికరమైన రాజకీయానికి తెర లేచింది. కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే అదును అన్నట్టుగా కాంగ్రెస్, భాజపాలు సిద్ధమౌతున్నాయి. దాదాపు అన్ని చోట్లా అధికార పార్టీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఒక్కో స్థానానికి సగటున ఆరు మంది చొప్పున తెరాసలో ఆశావహులున్నట్టు ఓ లెక్క ప్రచారంలోకి వచ్చింది. ఇంతమంది ఎలా అయ్యారంటే… అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కిందిస్థాయి కేడర్ ను పెద్ద సంఖ్యలో తెరాస చేర్చుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా వారంతా తెరాసకు అనుకూలంగానే పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఇది వాళ్ల టైమ్! ఏదో ఒకటి పార్టీ నుంచి ఆశిస్తారు కదా?
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తెరాస నుంచి ఇలానే చాలామంది టిక్కెట్లు ఆశించారు. అందరికీ రావు కాబట్టి… రానివారిలో అసంతృప్తి సహజం. ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్లీ సీట్లు ఆశిస్తున్నవారు ఉన్నారు. అయితే, వీళ్లంతా ఇప్పుడు ముందస్తుగానే ఒక హెచ్చరిక జారీ చేస్తూ… మాకు సీటిస్తే తెరాసలో ఉంటాం, లేదంటే జెండా మార్చేస్తాం అంటూ కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు అల్టిమేటమ్ లు ఇస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు సగం మంది కిందిస్థాయి తెరాస నేతలు తేడా వస్తే జెండా మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారట. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని సమాచారం. వరంగల్, నిజామాబాద్… ఓ ఐదారు మున్సిపాలిటీలు మినహా అన్ని చోట్లా ఆశావహులు ప్లాన్ – బితో సిద్ధంగా ఉన్నారనే నివేదిక తెరాస అధినాయకత్వానికి అందిందని సమాచారం.
ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, భాజపా సిద్ధంగా ఉన్నాయి. తెరాసలో టిక్కెట్ రాకపోతే మా దగ్గరకి రండి అంటూ ఆశావహులకు ఎరవేరే పనిలో ఈ పార్టీలున్నాయి. మున్సిపాలిటీల్లో కనీసం ఓ నాలుగు వందల ఓట్లు తెచ్చుకోగలరు అనుకునే నేతలతో భాజపా టచ్ లో ఉంటోందట. కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో చాలా చోట్ల ఇప్పటికే పావులు కదుపుతున్నట్టు సమాచారం. మొత్తానికి… ఈసారి తెరాస నేతలకు అసంతృప్తులతో తలనొప్పి గట్టిగా ఉండేట్టే ఉంది. అంతా మీరే చూసుకోవాలి, తేడా వస్తే పదవులు పీకేస్తా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతల మీద భారం పడేసిన సంగతి తెలిసిందే. కానీ, క్షేత్రస్థాయిలో వలసల పుణ్యమా అని పెరిగిపోయిన వేరు కుంపట్లను చల్లార్చడం అంత సులువైన పనిగా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తెరాస ఎలా డీల్ చేస్తుందో చూడాలి.