2013 జ్ఞాపకం వుందా? రాష్ట్ర విభజన ఖాయమైన తర్వాత- సార్వత్రిక ఎన్నికల ప్రాంగణంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి ఎన్నికలుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఎపిలో టిడిపి ఎక్కువగా గెలుచుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ బలం నిలబెట్టుకుంది. 2013 జులై 23,27,31 తేదీలలో ఈ ఎన్నికలు జరిగాయి. పరిపాలన మాత్రం ఆగష్టు 2 నుంచి మొదలైంది. మొత్తం 12,919 గ్రామ పంచాయితీలకు అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పూర్తయి ఇప్పటికి అయిదేళ్లు కావస్తుంది. కాని ముందే వాటిని రద్దు చేసి ఎన్నికలు జరపాలని ఎపి ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. జూన్ తర్వాత పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి గనక మేలోనే ఈ తతంగం ముగిస్తే సౌకర్యంగా వుంటుందని ఎన్నికల సంఘం ఆలోచనగా చెబుతున్నారు. చిన్నవిగా కనిపించే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిజానికి రాజకీయాలన్నిటికీ పునాదులు. అక్కడ విజయం కోసం ఎంత దూరం వెళతారో చెప్పడానికి లేదు. పైగా తర్వాతి రాజకీయ పోరాటాలకు సంకేతాలు కూడా విడుదలవుతాయి. కులాల వారి లెక్కలు తేలతాయి. ఇన్ని కారణాలతో చంద్రబాబు ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు ముగించేయాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే దీనికి సన్నాహంగా వార్డులను సమాన ఓటర్లు వుండేవిధంగా పునర్విభజించాలి. ఈ తతంగం డిసెంబరులో అయిపోతే తర్వాత ఎన్నికల సన్నాహాలు చేసుకోవాలని ఎన్నికల సంఘం అనుకుంటున్నదట.’కనుక గ్రామ సమరాలు తద్వారా భావి సమర సంకేతాలు తేలిపోవచ్చు. ఎవరు ఎటు వుంటారో అర్థం చేసుకోవచ్చు. కాకుంటే పంచాయితీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు గనక ఎవరికి వారు మేమే ఎక్కువని చెప్పుకోవడం కూడా జరుగుతుంటుంది.ఈ ఎన్నికలతో తర్వాతి ముందస్తు లేదా జమిలి ఎన్నికలకు సందడిమొదలవుతుంది.