కులగణన రిపోర్టును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పిస్తుంది.అప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. కానీ అవి న్యాయసమీక్షలో నిలుస్తాయో లేదో చెప్పలేమని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు. అందుకే ఆయన రాజకీయంగా ఓ సవాల్ చేశారు. ఇప్పటికిప్పుడు చట్ట పరంగా రిజర్వేషన్లు అమలు సాధ్యం కాకపోయినా సరే.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ అమలు చేస్తాయా అని సవాల్ చేశారు. ఈ సవాల్ పై ఆ రెండు పార్టీలు స్పందించే అవకాశం లేదు. ముందుగా రేవంత్ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కాబట్టి కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు.
అయితే కులగణన రిపోర్టు ఆధారంగా బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగవిరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు నేరుగా కులగణన ఆధారంగా కాకుండా డెడికేటెడ్ కమిషన్ ను రేవంత్ ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే … రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు. అసెంబ్లీ ఆమోదించిన నివేదిక ద్వారా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. అందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు. అలా ఇస్తే సుప్రీంకోర్టు నిర్ణయించిన యాభై శాతం పరిమితి దాటి పోతుంది. అప్పుడు చెల్లవు.
అందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి సమస్యలు వచ్చినా.. రాకపోయినా సరే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇద్దామని సవాల్ చేశారు. తాము అంతే ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఫ్పై శాతానికిపైగా ఇచ్చామన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం ఇస్తామని.. ఇతర పార్టీలు సిద్దపడాలని చాలెంజ్ చేశారు. అయితే ఇలా కాదని.. చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.