కేంద్రంలో మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని కాకుండా ఉండే లక్ష్యంతో… చంద్రబాబునాయుడు.. చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి… చంద్రబాబు వేసిన అడుగు ఓ సంచలనమే. దీనిపై నిఖార్సైన టీడీపీ అభిమానులు, నేతలు ఎవరూ… వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఓ రకంగా సంతోషంగా ఉన్నారు. టీడీపీ ఉనికినే చాలెంజ్ చేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ ఉండాల్సిందేనన్న ఆవశ్యకత టీడీపీ నేతలకు శ్రేణులకు అర్థం అయింది. కానీ… ఈ విషయంలో బాధపడిపోతున్న వారంతా… వైసీపీ, బీజేపీ, జనేసన, టీఆర్ఎస్కు చెందిన నేతలే.
ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భావం..!
ప్రతి సందర్భంలోనూ రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు.. తమ పార్టీకి ఏది మేలు చేస్తుందో అదే చేసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందనే వాదనను.. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు చూపిస్తూ.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందనే దాకా వెళ్లిపోతున్నారు. వీళ్లేవరు.. తమ జీవితంలో ఒక్క సారి కూడా.. ఎన్టీఆర్ గురించి మంచి మాట చెప్పని వాళ్లే. ఇప్పుడు హఠాత్తుగా వీళ్లందరికి ఎన్టీఆర్ ఆత్మ గురించి చర్చకు వస్తోంది. నిజానికి .. ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టింది.. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. ఆనాడు ఢిల్లీలో తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ గాంధీలు… అందర్నీ అవమానిస్తూంటే.. తెలుగు వాళ్లను లెక్క చేయకపోతూండటంతో…ఆత్మగౌరవ పోరాటంలో పార్టీ పెట్టారు. విజయం సాధించారు. అప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉంది కాబట్టి.. కాంగ్రెస్‌కు వ్యతిరేకం. ఆ స్థానంలో బీజేపీ ఉంటే.. బీజేపీకి వ్యతిరేకం అయ్యేది. అంటే.. ఇక్కడ పాయింట్ కాంగ్రెస్సా.. బీజేపీనా అన్నది కాదు.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీస్తే వారికి వ్యతిరేకంగా పోరాడటం. అంటే.. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భవించింది.
కాంగ్రెస్‌ను బూచిగా చూపి బీజేపీని కాపాడాలా…?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లేస్‌లోకి బీజేపీ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ తెలుగు వాళ్లని ఎంతగా అవమానించిందో.. అంత కన్నా ఎక్కువగా.. ఇప్పుడు బీజేపీ.. తెలుగు జాతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి క్రియాశీలకంగా వ్యవహరించిన బీజేపీ… పార్లమెంట్ సాక్షిగా.. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అమలు చేయాలని అడిగిన.. తెలుగు ప్రజల ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి.. నిందలేయడానికి… ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ సంస్థలను వాడుకుని రాజకీయ ఆట ఆడుతోంది. ఓ రకంగా… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా అవమానిస్తోంది. ఇలాంటి పరిస్థితిలోనూ.. పుట్టినప్పుడు.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టామని.. బీజేపీని నెత్తిన పెట్టుకోవాలా..?. కనీసం ఐక్యతా విగ్రహం పెట్టినప్పుడు… తెలుగు భాషకు చోటు కల్పించడానికికూడా మనసు రాని… యూనిటీ పేరుతో తెలుగు జాతి అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీని.. ఇప్పటికీ కాంగ్రెస్ ను బూచిగా చూపి కాపాడాలా..?
కాంగ్రెస్ కన్నా దారుణంగా ఆంధ్రులపై బీజేపీ వైఖరి..!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. దిద్దుకోలేని తప్పు చేసింది. దానికి ఆ పార్టీ అంతకు మించి శిక్ష అనుభవించింది. కానీ.. అంత కంటే ఘోరమైన తప్పును బీజేపీ చేసింది. ఇష్టం లేకపోయినా.. ఏపీ ప్రజల్ని నడి రోడ్డుపైన పడేసి… కనీస సదుపాయాల్ని కల్పిస్తామన్న హామీని కూడా మరిచింది. కానీ కాంగ్రెస్ తనకు చాన్స్ ఇస్తే అన్నీ ఇస్తామని అంటోంది. వేరే ఆప్షన్ లేదు. బీజేపీ ఇవ్వనే ఇవ్వబోము ఏం చేసుకుంటారో.. చేసుకోండి.. అని తేల్చి చెప్పిన తర్వాత…. ఏపీ కోసం ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కాంగ్రెస్. ఇలాంటి సమయంలో… నాలుగు దశాబ్దాల కిందట.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టామని… ఏపీకి ఆక్సిజన్ ఇస్తామంటున్న కాంగ్రెస్‌తో దూరంగా ఉండటం… ఆంధ్రుల అస్థిత్వాన్ని కించపరుస్తున్న బీజేపీని గద్దె దించకుండా.. సైలెంట్‌గా ఉండటం కరేక్టేనా..?
ఎన్టీఆర్ బతికి ఉన్నా కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్లేవారా..?
ఆత్మగౌరవాన్ని కాపాడుకోవమే ఎన్టీఆర్ నేర్పారని చంద్రబాబు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఎన్టీఆర్ బతికి ఉంటే… కచ్చితంగా ఈ పాటికి … కాంగ్రెస్ ఉన్న రాజకీయ ఫ్రంట్ రెడీ అయిపోయి ఉండేదే. నాలుగు దశాబ్దాల కిందటి కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు బీజేపీ. రూపం, మనుషులు, పేరు మారిందేమో కానీ… అదే స్వభావం. ఇంకా చెప్పాలంటే..అంతకు మించి ప్రజాస్వామ్య హననం సాగిస్తున్న పార్టీ అది. ఇటీవలి కాలంలో గవర్నర్ల దగ్గర్నుంచి ఆర్బీఐ వరకూ… రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన తీరు చూశారు. కాంగ్రెస్ అరవై ఏళ్లలో చేయని పతనాన్ని… కేవలం నాలుగేళ్లలో బీజేపీ చేసింది. ఎన్టీఆర్ ఉన్నా…. కాంగ్రెస్ పార్టీతో కలిసి దేశాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా రంగంలోకి దిగేవారేనది టీడీపీ నేతల అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్ – టీడీపీ అని విమర్శలు చేస్తున్నవారెవరూ.. తమ జీవితంలో… ఎన్టీఆర్ గురించి కానీ.. టీడీపీ గురించి కానీ.. ఇంత ఆవేదన చెంది ఉండరు. బహుశా.. ఓటు కూడా వేసి ఉండకపోవచ్చు. ఈ విమర్శల్లో ఉండేది రాజకీయమే….!.
———సుభాష్