దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది! పెద్ద నోట్ల రద్దుతో పారిశ్రామిక రంగం కుంటుపడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచీ భారత ఐటీ రంగానికి టెన్షన్ పట్టుకుంది. పరిస్థితులు ఇలా ఉన్నాసరే… ఆంధ్రాకు కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూల్లో నిలబడ్డాయి! ఎం.ఒ.యు.లు కుదుర్చుకున్నాయి. సంతకాలు పెట్టేసుకున్నాయి. ఫైళ్లు మార్చేసుకున్నాయి! ఇదంతా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లనే సాధ్యమైందా..? భాగస్వామ్య సదస్సును అనుకున్న కంటే అతి భారీగా సక్సెస్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? లక్ష్యానికి మించిన లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? వీటన్నింటి వెనకా ఏదో మతలబు ఉందనే అనిపిస్తోంది.
విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తే చాలు అనేది చంద్రబాబు సర్కారు లక్ష్యం. అయితే, రూ. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగిపోయాయి! అంటే, లక్ష్యానికి మించి సాధించేసినట్టే కదా! విచిత్రం ఏంటంటే.. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడూ… అత్యంత అభివృద్ధి చెందిన అంతర్జాతీయ స్థాయి నగరం హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ఓ ఏడు వేల కోట్లకు మించిన ఒప్పందాలు నాటి భాగస్వామ్య సదస్సులో జరగలేదు. మరి, దేశంలో ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయీ… ఐటీ రంగం కూడా ట్రంప్ భయంతో వణుకుతూ ఉందీ… ఆంధ్రా రాజధాని నగర నిర్మాణం మొదలుకాలేదూ.. జరగాల్సిన అభివృద్ధి అంతా ఇంకా త్రీడీ ప్రెజెంటేషన్ల స్థాయిలో ఉంది. అయినా సరే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఏ ప్రాతిపదిక వచ్చాయన్నది కొంతమందికి అర్థం కావడం లేదు!
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలూ, ప్రభుత్వం రంగ సంస్థల ఒప్పందాలతోపాటు, కొత్తగా వచ్చిన కొన్ని పెట్టుబడులను కలగలిపి ఈ లెక్క చెప్పేస్తున్నారా అనేది కొంతమంది ఆరోపణ. అయితే, లక్ష్యానికి మించిన పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవడం వెనక చంద్రబాబు సర్కారు వ్యూహం వేరేలా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమం మరోసారి ట్రాక్ మీదికి వచ్చేసింది. ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇద్దరూ ఎవరిదారిన వారు ఉద్యమించబోతున్న సంగతి తెలిసిందే. వారికి సమాధానమే ఈ లక్ష్యానికి మించిన లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ! లక్షల ఉద్యోగాల కల్పన..! ‘ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే సాధించాం’ అని ప్రచారం చేసుకునేందుకు తెలుగుదేశం ఇకపై సన్నద్ధం కావొచ్చు. హోదా డిమాండుకు సమాధానాలే ఈ పెట్టుబడుల లెక్కలూ ఉద్యోగ కల్పన ప్రకటనలు! భారీ పెట్టుబడుల ప్రకటనల వెనక వ్యూహం ఇదే.