ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి మీడియాకు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న వందల కోట్ల ధనం ప్రకటనల రూపంలో తరలిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రకటనలకు తోడు.. సాక్షి పత్రికను కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. గ్రామ, వార్డు సచివాలయాలు.. ఉద్యోగులతో కూడా కొనిపిస్తున్నారు. తాజాగా వాలంటీర్లతోనూ కొనిపిస్తున్నారు. అంతా ప్రజాధనమే. ప్రభుత్వం మారిన తర్వాత ఈ లెక్కలన్నీ బయట పెట్టి..ఎక్కడెక్కడ ఎంత నొక్కారో ప్రజల ముందు పెడతారు. గత ప్రభుత్వంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలకు వేల కోట్లు ఇచ్చారని విజయసాయిరెడ్డి వంటి నేతలు ఆరోపించారు కానీ వాస్తవమేంటో ఇంత వరకూ బయట పెట్టలేదు. లెక్కలు చెప్పలేదు. అంటే.. అంత గొప్పగా ఏమీ ఇవ్వలేదని అనుకోవాలి.
కానీ ఇప్పుడు సాక్షికి ప్రజాధనం దోచి పెడుతున్న వైనం మాత్రం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే సాక్షికి ప్రజాధనం మాత్రమే కాదు.. పార్టీ నేతల ధనం కూడా విరివిగా అందుతుంది. వైసీపీ నేత అయితే స్థాయికి తగ్గట్లుగా సాక్షిలో సందర్భాన్ని బట్టి ప్రకటనలు ఇచ్చుకోవాలి. ఇది రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ జరుగుతుంది. పండుగలకు.. సీఎం పుట్టిన రోజులకు.. ఇతర సందర్భాలకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు ప్రకటనలు ఇస్తూంటారు. ఒక్కో సారి అవసరం ఉన్నా లేకపోయినా ఇస్తూంటారు. ఎందుకంటే.. వారు సమర్పించుకోవాలి కాబట్టి.
వ్యాపారాలు ఆపేస్తామని భయ పెట్టి వైసీపీలో చేర్చుకున్న శిద్దా రాఘవరావు వంటి వారు కూడా ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తారంటే.. ఎందుకో అర్థం చేసుకోవచ్చు. ఇక… చైతన్య విద్యాసంస్థలు వంటివి భయంతో ఇచ్చే ప్రకటనలకు లెక్కే లేదు. అంటే అటు ప్రజాధనం.. ఇటు నేతల ధనంతో పాటు.. ఇతర మార్గాల్లోనూ ఆదాయం తెచ్చుకుంటారన్నమాట. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చే్యడం గతంలో ఎవరూ చేసి ఉండరు. ఎందుకంటే సొంత వ్యాపారాలను ఇలా చేయడం నైతిక ప్రవర్తన కాదని.. ప్రజలు ఏమైనా అనుకుంటారని అనుకునేవాళ్లు. ఇప్పుడాలంటి మొహమాటాలు లేవు.