రాజకీయపార్టీకి రూపుకట్టే పనిలో బిజీగా ఉన్న హీరో కమల్ హాసన్… ఆ పార్టీని జనం తిరస్కరిస్తే ఏం చేస్తారు? మన మెగాస్టార్లాగా మూటా ముల్లె సర్ధుకుని మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అంటారా? రాజకీయాలను వదిలేసి తెరపై మాత్రమే విశ్వరూపాన్ని ఆవిష్కరించడానికి పరిమితం అవుతారా?
ఇండియా టుడే టీవీ కన్సల్లింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్ధేశాయ్కి సమాధానం ఇస్తూ… తాను అలా చాప చుట్టేయబోవడం లేదన్నారు కమల్ హాసన్. ఎన్నికల ఫలితాల్లో జనం తిరస్కరించినా సరే… జనం తరపున ఒక గొంతుకగా తన పార్టీ ఉంటుందన్నారు. తను ఉన్నంత వరకూ మాత్రమే కాదు తన తర్వాత కూడా ఆ గొంతు వినపడాలనేదే తన ఆశయమన్నారు.
హిందూత్వపై తాను చేసిన వ్యాఖ్యల్ని కమల్ గట్టిగా సమర్ధించుకున్నారు. ముస్లిం ఐనా, క్రైస్తవమైనా, బుధ్దిజం అయినా… ఇతర మతం పట్ల వ్యతిరేకతను పెంచే తీవ్రమైన భావజాలం ఏ మతంలో ఉన్నా అది సరైంది కాదనేది తన అభిప్రాయమన్నారు. పరమత సహనం అనేది తనకు పుట్టుకతోనే అబ్బిందన్నారు. తమ ఇంట్లో తాను నాస్తికుడినైనా సరే తన సోదరుడు చారుహాసన్తో కలిసి ఒకే ఇంట్లో జీవించినప్పుడు ఆయనకు ఉండే మతభావాలను గౌరవించేవాడినన్నారు.
తాను తాజాగా హిందుత్వపై చేసిన వ్యాఖ్యాలను సమర్ధించుకుంటూనే… హిందూత్వ తీవ్రవాదం ఒకప్పుడు కూడా ఉండేదనడానికి గాంధీని గాడ్సే కాల్చి చంపడాన్ని ఉదహరించారు.
ఇక ధియేటర్లలో జనగణమన తప్పనిసరి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది సరైన నిర్ణయం కాదన్నారు. ఒక బార్లో సుప్రభాతం పాడితే అది సరైనదే అంటారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. సినిమా హాళ్లకు మద్యం సేవించి వచ్చేవాళ్లు కూడా ఉంటారని, అలాంటి వారు నిలబడలేని స్థితిలో కూడా ఉందొచ్చునన్నారు. పవిత్రమైన పరిసరాల్లో మాత్రమే దేశభక్తి గీతాలాపన, దాన్ని గౌరవించడం జరగాలన్నారు. తాను దేశభక్తి ఉన్నవాడినేనా అంటే… అసలు తను దేనికీ భక్తుడిని కాదన్నారు.
దాదాపు 30 నిమిషాల సేపు సాగిన ఈ సంభాషణ ఆసక్తి కరంగా సాగింది. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు కమల్ సమాధానాలకు హర్షధ్వానాలతో స్పందించారు. అంతేకాదు…ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగానే షేర్ చేసుకోవడం కనిపిస్తోంది.