రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమాలను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర ట్రైలర్ గురించి తనదైన విశ్లేషణ ఇచ్చారు. ఈ సినిమాలో పరుచూరి కి రామాయణం పోలికలు కనిపించాయి.
‘రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు రూపొందించారేమో అని అనిపించింది. రాముడు సముద్రాన్ని దాటినట్లు ‘దేవర’లోనూ ఎన్టీఆర్ పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్లు చూపించారు. ‘దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధమూ దొరకాలి’ అనే డైలాగ్ వుంది. రామాయణంలోనూ రాముడు ఎన్నో బాణాలు ఉపయోగించాడు. ఇందులోని చాలా అంశాలు రామాయణాన్ని పోలి ఉంటుందనిపిస్తుంది’ అని అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి సోదరులకు నందమూరి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం. చిన ఎన్టీఆర్ అంటే మరింత ప్రేమ. సినిమా విడుదలైయ్యాక పరుచూరి గోపాల కృష్ణ పూర్తి స్థాయి రివ్యూ ఇవ్వాలని అభిమానులు కోరుకొంటున్నారు.
భారీ అంచనాలు వున్న దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకులు ముందు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ లెవల్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.