పరుచూరి బ్రదర్స్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ వెంటే! చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలకెన్నింటికో రచన అందించారు. పవన్ కల్యాణ్ సినిమాకి పని చేయకపోయినా.. తనపై అభిమానం కురిపిస్తూనే ఉంటారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ పవన్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాల్లో ఉండుంటే, మరో నాలుగైదు ఏళ్లలో చిరంజీవిలా సూపర్ స్టార్లా ఎదిగేవాడని, అలాక్కాకుండా సమాజానికి ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడని, రాజకీయాల్లో ఓసారి దెబ్బతిన్నా… ఇప్పుడు దెబ్బతిన్న పులిలా విజృంభించడానికి వస్తున్నాడని, పవన్ రాజకీయాల్లో ఉన్నా అప్పుడప్పుడైనా సినిమాలు చేయాలని పవన్‌కి సలహా ఇచ్చారు.
పవన్ బంగారం లాంటి వ్యక్తి అని, తను సినిమాల్లో ఉండుంటే ఇంకెంతో సంపాదించేవాడని, కానీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సమాజం మారాలంటే, అధికారం చేతులు మారుతూ ఉండాలని, అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉంటే, ప్రజలు ఆ పాలనకు అలవాటైపోయి, నిస్సహాయతకు గురవుతుంటారని, కాబట్టి పవన్ ఈ సమాజంలో, పాలనలో మార్పు తీసుకురావాలనుకొంటున్నాడని చెప్పుకొచ్చారు. పవన్ అభిమానుల్ని ఓట్లుగా మలచుకోవాలని, ఇక విమర్శలు మామూలే అని, భీష్ముడికి బాణాలు ఎలా తగులుతుంటాయో, ఎన్ని బాణాలొచ్చినా లెక్క చేయకూడదని, పోరాడి నిలబడినప్పుడే రాజకీయం, అధికారం చేతుల్లోకి వస్తుందని పవన్‌కి ధైర్యం చెప్పారు.