రివ్యూల మీద చాలా మెచ్యూర్డ్ గా, లాజికల్ గా స్పందించారు రచయిత పరుచూరి. స్వతహా గా కొన్ని వందల సినిమాలకి రచయిత అయి ఉండటం వల్ల, పైగా దర్శకత్వం చేసిన అనుభవం ఉండటం వల్లా, వీటన్నింటికి మించి మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో ఉండి దాదాపు మూడు తరాల నటులకి పని చేయడం వల్లా, అత్యంత మెచ్యూర్డ్ గా, తమ స్వంత అనుభవాలని ఉటంకించి మరీ స్పందించారు రచయిత పరుచూరి గోపాల కృష్ణ.
చిరంజీవి కెరీర్ నే మలుపుతిప్పిన తమ ఖైదీ సినిమా రిలీజైనప్పుడు, ఒక సమీక్షకుడు – “ద్వితీయార్థం లో అడవి పాలైన ఖైదీ” అని హెడ్డింగ్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించి ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వు వస్తుందని అన్నాడు. అలాగే ఎమ్మెస్ రెడ్డి గారి 20 వ సినిమా పల్నాటి సిం హం చాలా పెద్ద హిట్టైనపుడు ఆయన, తనకి 19 సినిమాలుగా రాని హిట్ ని ఈ సినిమా ద్వారా ఇచ్చినందుకు ఆ సినిమాకి పని చేసిన టెక్నీషియన్లకి అందరికీ కృతఙ్ఞతలు చెబుతూ ఆనందంగా ఉన్న సమయం లో కంటబడ్డ ఒక రివ్యూ, “కత్తి పట్టబోయి సుత్తి పట్టిన పల్నాటి సిం హం” అని హెడ్డింగ్ ఉన్న రివ్యూ. ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అలాంటప్పుడు కూడా తామెన్నడూ ఎవరి మీదా మాట తూలలేదనీ, ఈ దేశం లో వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం ఉన్నాయని అన్నారు.
అలాగే 1987 లో విడుదలై పెద్ద హిట్టయిన ప్రజాస్వామ్యం చిత్రం లో తాము ఒక కొత్త పాయింట్ లేవనెత్తినట్టు చెప్పారు. ఒక ఎన్నికల్లో డిపాజిట్టు కోల్పోయేలా ఓడిపోయిన వ్యక్తి, ఢిల్లీ వెళ్ళి రాజ్యసభ సభ్యుడై, మంత్రిగా తిరిగి వస్తాడు. మరి ప్రజలు ఛీత్కరించుకున్న ఆ వ్యక్తి మంత్రి అయితే, ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించిన ఆ పాయింట్ అప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. అయితే ఒక సమీక్షకుడు ఈ సినిమాకి కూడా, “కొత్తదనం లేని ప్రజాస్వామ్యం” అని హెడ్డింగ్ పెట్టాడట. ఇవే కాదు, సంవత్సరం రోజులు ఆడిన బొబ్బిలి రాజా సినిమాకి, సూపర్ డూపర్ హిట్టయిన అసెంబ్లీ రౌడీకి కూడా ఇలాంటి రివ్యూలే వచ్చాయని వచ్చాయని అంటూ బహుశా పిల్లలకి (మంచు విష్ణు) ఈ విషయం తెలిసే ఉంటుంది అని చమత్కరించాడు.
అయితే ఇంత సుదీర్ఘమైన కెరీర్ లోనూ తాము వాక్ స్వేచ్ఛని, పత్రికా స్వేచ్ఛనీ గౌరవించినట్టు చెబుతూ, రివ్యూల మీద స్పందించవలసిన తీరుని చెప్పకనే చెప్పారు పరుచూరి.