రజనీకాంత్సినిమాలో పనిచేస్తారా అంటే… ఎవ్వరైనా సరే ‘యస్’ అనేస్తారు. ముందూ వెనుకా ఆలోచించరు. ఆ క్రేజ్ అలాంటిది. రజనీ సినిమా అంటే.. పది హిట్ చిత్రాలకు సరిపడ మైలేజీ వచ్చేస్తుంది. అందుకే… అందరూ అంత ఉత్సాహం చూపిస్తారు. అయితే పరుచూరి బ్రదర్స్ మాత్రం ‘నో’ చెప్పారట. స్వయంగా రజనీకాంత్ అడిగినా కాదన్నారట. ఈ విషాయన్ని పరుచూరి గోపాల కృష్ణ ‘కబాలి’ ఆడియో ఫంక్షన్లో గుర్తు చేసుకొన్నారు. రజనీకాంత్ నటించిన కబాలి ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ రజనీకాంత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.
బాబా సినిమా తీస్తున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ని తెలుగులో డైలాగులు రాయమన్నార్ట రజనీకాంత్. అయితే పరుచూరి వాళ్లు మాత్రం నిరాకరించార్ట. ”లిప్ సింక్ కి డైలాగులు రాయడం మాకు రాదు… క్షమించండి” అంటూ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నార్ట. పరుచూరి డైలాగులు రాసిన సమరసింహారెడ్డిలో ఓ సీన్ చూసి రజనీ చాలా ముచ్చటపడ్డాడట. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన వంశానికొక్కడు సినిమా అన్నా.. రజనీకి చాలా ఇష్టమట. ”ఆ కథనాకు ఇస్తే…సిల్వర్ జూబ్లీ సినిమా తీస్తా” అనేవార్ట. అదీ.. సంగతి.