ఒక సీనియర్ రచయిత గా జై లవ కుశ మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పరుచూరి గోపాల కృష్ణ. ఇది “రివ్యూ” కాదు, కేవలం తన “వ్యూ” అని చెబుత్తొనే, నిర్మొహమాటంగా తప్పులు, ఒప్పులు రెండింటినీ విశ్లేషించారు పరుచూరి.
ఆయన చెప్పింది మొత్తానికి ఇదీ- “అసలు ఇది ముగ్గురు అన్నదమ్ముల సినిమా అనగానే, యాదోంకీ బారాత్, అన్నదమ్ముల అనుబంధం, ముగ్గురు కొడుకులు తరహా లో అన్నదమ్ములు ముందు విడిపోయి, తర్వాత కలిసే సినిమా అని అందరూ ఊహిస్తారు. అయితే ఇందులోనూ ముగ్గురూ చిన్నపుడు విడిపోవడం, తర్వాత ఇద్దర్నీ జై తీసుకొచ్చేయడం వరకూ ప్రిడిక్టబులే (ఊహించగలిగేదే) అయినా, ఒకర్ని ఓట్లు అడగమని, మరొకరిని అమ్మాయిని ప్రేమలో గెలిచిపెట్టమని అడగటం మాత్రం ప్రిడిక్టబుల్ కాదు. ఈ విషయం లో బాబీ ని మెచ్చుకోవచ్చు. అలాగే జై పాత్రని రాముడి లాంటి ధీరోద్ధాతుడి గా కాకుండా రావణుడి లాంటి వాడిగా చిత్రించే విషయం లో కూడ బాబీ ని మెచ్చుకోవచ్చు. అయితే ఒక్క విషయం లో మాత్రం బాబీ విషయం లో కాస్త అసంతృప్తి ఉంది. అదేంటంటే, అంతకు మునుపు “మనం అనేది అబద్దం, నేనన్నదే నిజం” అన్న పాత్ర చేతనే క్లైమాక్ లో “నేనన్నది అబద్దం మనం అన్నదే నిజం” అని చెప్పించి ఉండాల్సింది. అందులో అలా చెప్పించగలిగే సందర్భం కూడా ఉంది. జై కోసం చచ్చిపోవడానికి లవ కుశలు సిద్దపడ్డ సందర్భం లో ఈ డైలాగ్ పెట్టిఉంటే, ఖచ్చితంగా సందర్భోచితంగా ఉండటమే కాక ప్రేక్షకులని ఆకట్టుకునేదీ, జై పాత్రని చంపకుండా ఉండే అవకాశమూ ఉండేది. జై పాత్ర బ్రతకడం ప్రిడిక్టబులే అయినా, ప్రేక్షకులకి అదే నచ్చుతుంది. ఎందుకంటే, ఇండియా పాక్ యుద్దం మీద సినిమా తీస్తే ప్రతి భారతీయుడికీ ఇండియా గెలిచే క్లైమాక్సే నచ్చుతుంది ప్రిడిక్టబుల్ అయినప్పటికీ. “. ఇదీ బాబీ లోని రచయితని సీనియర్ రచయిత గా పరుచూరి ని విశ్లేషించిన తీరు.
ఇక తారక్ నటనకి మాత్రం మూడు పాత్రలకీ వంద శాతం మార్కులు వేసారు. హేట్సాఫ్ చెప్పారు. ప్రత్యేకించి జై పాత్ర ని, కళ్ళు చిన్నవిగా చేసి నటించడం ద్వారా పాత్రలోని తత్వాన్ని ప్రదర్శించిన తీరుని అభినందించారు.