బళ్లు ఓడలు అవ్వడం, ఓడలు బళ్లవ్వడం చాలా ఈజీ. సినిమాల్లోనూ అంతే.. రాత్రికి రాత్రే ప్రాజెక్టులు చేజారిపోతుంటాయి. అంతా ఓకే.. షూటింగుకి రెడీ అనుకున్న సినిమాలెన్నో ఆగిపోయాయి. అంతెందుకు.. షూటింగ్ మొదలై కూడా అర్థాంతరంగా పేకప్ చెప్పేసిన కథలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మహేష్‌బాబు సినిమా `సర్కారు వారి పాట` విషయంలోనూ అదే జరగబోతోందేమో అన్నది పరశురామ్ భయం.. అనుమానం.
`సరిలేరు నీకెవ్వరు` తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో మహేష్ చాలా ఆలోచించాడు. వంశీ పైడిపల్లి, సుకుమార్.. ఇలా కొంతమంది పేర్లు వినిపించాయి. సుక్కుతో సినిమా ఓకే అయ్యేదే. కానీ ఎక్కడో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో.. పరశురామ్ కథని పట్టాలెక్కించాల్సివచ్చింది. ఆ సమయంలో మహేష్ ముందు పరశురామ్ కంటే మంచి ఆప్షన్ లేదు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు త్రివిక్రమ్ `మై హూ నా..` అంటూ మహేష్ తలుపు తట్టాడు. మహేష్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేయాలన్న టెమ్టింగ్ లో ఉన్నాడు. పరశురామ్ ప్రాజెక్టు పక్కన పెట్టి, త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని.. ఇండ్రస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. సర్కారు వారి పాట చేయాల్సిన మైత్రీ మూవీస్, 14 రీల్స్‌ని… హారిక హాసినిలతో టై అప్ చేస్తే నిర్మాతలు కూడా `నో` చెప్పలేరు. `మన సినిమాకి ఇంకో యేడాది ఆగుదాం` అని పరశురామ్ ని అంటే `కాదన`లేడు. ఇలా.. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.
నిజానికి ఈపాటికి అమెరికాలో షూటింగ్ మొదలవ్వాల్సిందే. వీసాలు దొరకలేదన్న కారణంతో… సినిమాని జనవరికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ వాయిదా పర్వాన్ని మరో నాలుగైదు నెలలు ముందుకు కొనసాగించి, ఈ లోగా త్రివిక్రమ్ సినిమాని పూర్తి చేసినా ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే… మహేష్ తీసుకునే నిర్ణయాలు ఆ స్థాయిలో ఉంటాయి. త్రివిక్రమ్ కూడా ఈ గ్యాప్ ని భర్తీ చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఎన్టీఆర్ వచ్చేలోగా… ఎట్టిపరిస్థితుల్లోనూ ఓ సినిమా పూర్తి చేయాలన్నది త్రివిక్రమ్ ఉద్దేశం. అదే మహేష్ బాబుతో అయితే తిరిగే ఉండదు. ఎటు చూసినా `సర్కారు వారి పాట` సినిమాకి బ్రేకులు పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.