దర్శకుడు పెద్ద వంశీ గురించి, ఆయన తీసిన సినిమాల గురించి ఈతరం ప్రేక్షకులకు బహుశా తెలుసేమో. 1990లలో ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్ టైలర్’, ‘మహర్షి’ తదితర మంచి సినిమాలను తీశారు. గోదావరి జిల్లాల్లో వ్యక్తుల మనస్తత్వాలని, అక్కడి వాతావరణాన్ని ఆవిష్కరించేలా ‘పసలపూడి కథలు’, ‘దిగువ గోదావరి కథలు’ రాశారు. వంశీ మంచి రచయిత, దర్శకుడు. కానీ, మంచి సినిమా తీసి చాలా రోజులైంది. అయినా ఆయన సినిమా వస్తుందంటే ఆసక్తి చూపించే ప్రేక్షకులు కొందరు వున్నారు. వాళ్లందరికీ ఒక శుభవార్త. త్వరలో వంశీ కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. ‘పసలపూడి’ అనేది సినిమా టైటిల్. అది ఆయన సొంతూరు పేరే. అలాగే, ఆయనకు రచయితగా మంచి పేరు తీసుకొచ్చిన ‘పసలపూడి కథలు’ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఈ సినిమాని ఎన్నారైలు నిర్మించనున్నారు.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే… వంశీ సినిమాలు అంటే స్వర్గీయ బాపుగారు గీసిన టైటిల్స్ గుర్తు వస్తాయి. వంశీ రాసిన కథల పుస్తకాలకూ ఆయనే టైటిల్స్ గీశారు. తాజాగా ‘పసలపూడి’కి సైతం బాపు చేత టైటిల్ రాయించుకుని భద్రంగా దాచుకున్నానని వంశీ తెలిపారు. ఆయన తీయబోయే మరో రెండు మూడు సినిమాలకు బాపు గీసిన టైటిల్స్ వున్నాయని అన్నారు.