కరోనా వైరస్ విషయంలో ప్రపంచం అంతా కిందా మీద పడుతూంటే.. భారత్‌లో మాత్రం..ఆ వైరస్‌కి మెడిసిన్స్‌ను అదే పనిగా విడుదల చేస్తున్నాయి… కంపెనీలు. సిప్లా, హెటెరో, గ్లెన్ మార్క్ ఇప్పటికే తాము కరోనాపై విజయం సాధించే మందులను క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి మరీ సిద్ధం చేశామని ప్రకటించి..దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉందని..మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో మిగతా ఫార్మా కంపెనీలు కూడా రేపో మాపో…తమ బ్రాండ్ కరోనా మందులు విడుదల చేస్తాయి. అయితే ఇవన్నీ ఇంగ్లిష్ మందులు. ఇక ఆయుర్వేద రంగంలో తామే ముందున్నామంటూ…పతంజలి కూడా తెరపైకి వచ్చింది. కోరోనిల్ పేరుతో..ఓ మందును ఆర్భాటంగా విడుదల చేసేసింది.
తాము కూడా ఆయుర్వేద పద్దతిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. విజయం సాధించామని..అందుకే విడుదల చేస్తున్నామని ప్రకటించారు. వారం రోజుల్లోనే కరోనా నయమైపోతుందని బాబా రాందేవ్ చెబుతున్నారు. ఓ వైపు దేశంలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. ఏ మందులు వాడారో… వైద్యులకే అర్థం కావడం లేదు. ఈ సమయంలో ఫార్మా కంపెనీలు… ఆయుర్వేద కంపెనీలు..వరుసగా మెడిసిన్స్ విడుదల చేస్తూ పోతున్నాయి. వాటి ధర కూడా ఏ మాత్రం తక్కువ ఉండటం లేదు. మనుషుల్లో ఉన్న భయాన్ని మార్కెట్ చేసుకునేందుకే ఫార్మా కంపెనీలు ఆరాట పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతర దేశాల్లో ఎక్కడా…ఎంత దిగ్గజ కంపెనీ అయినా.. తాము కరోనా మందును కనిపెట్టామని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు విడుదలవుతున్న మెడిసిన్స్ అన్నీ కరోనాను తగ్గిస్తాయా…ఆ పేరుతో.. రోగుల ఆస్తులను తగ్గిస్తాయా..అన్నదానిపై తర్వాతేక్లారిటీ వస్తుంది. ఎందుకంటే.. వాటి ధరలు..ఆ రేంజ్‌లోనే ఉన్నాయి మరి..!