కొడంగల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మామ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంత హ ఠాత్తుగా ఆయన ఎందుకు కాంగ్రెస్ లో చేరారా అన్నదానిపై బీఆర్ఎస్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పట్నం బ్రదర్స్ ప్లేట్ ఫిరాయించడానికి రెడీ అయ్యారనే సంకేతాలు పంపుతున్నారు.
కొడంగల్ లో పరిస్థితి కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ఉంది. రేవంత్ రెడ్డి బలమైన సీఎం అభ్యర్థిగా తెరపైకి రావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ ను ఓడించడానికి గత ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారు. అనేక హామీలు ఇచ్చారు. కానీ ఏ పనీ చేయలేకపోయారు. దీంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డికి కొడంగల్ లో పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితి ఉందని.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గాలి ఉందన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో పట్నం బ్రదర్స్… రిస్క్ లేకుండా చర్యలు తీసకుంటున్నారని చెబుతున్నారు.
పట్నం నరేందర్ రెడ్డి అన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి తాండూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి క్షణంలో మంత్రి ని చేసి కేసీఆర్ ఆపేశారు. ఇప్పుడు కొడంగల్ లో విపరీతంగా ఖర్చు చేసి.. రేవంత్ ను టార్గెట్ చేస్తే.. రేపు ఆయన గెలిస్తే తమ పరిస్థితి ఏమిటన్నదానిపై పట్నం బ్రదర్స్ కంగారు పడుతున్నారని చెబుతున్నారు. అందుకే కొడంగల్ లో చూసీ చూడనట్లుగా పోయే ఆలోచన చేస్తున్నారని.. రేవంత్ జోలికి రాబోమని సంకేతాలు పంపుతూ.. ఆయన మామను కాంగ్రెస్ లోకి పంపించారని చెబుతున్నారు.
పట్నం బ్రదర్స్ గాలి ఎటు వైపు ఉంటే అటు వైపు ఉంటారు. గతంలో టీడీపీలో ఉండేవారు. తర్వాత బీఆర్ఎస్… రాజకీయంగా వారు తమ పట్టు కోల్పోవడానికి ఏ మాత్రం సిద్ధంగా ఉండరు. అందుకే ముందుగానే రేవంత్ రెడ్డి రూట్లోకి వెళ్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.