యూపిఏ హయాంలో లౌకికవాదం, అవినీతి, కుంభకోణాలనే పదాలు ఎక్కువగా వినిపించేవి తప్ప ఏనాడూ దేశభక్తి, జాతీయతావాదం వంటివి వినబడేవి కావు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి తారుమారు అయినట్లుంది. ఇప్పుడు తరచూ దేశభక్తి, జాతీయతావాదం, కొత్తగా మత అసహనం అనే మరో పదం కూడా వినబడుతోంది. అయితే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలనే పదాలు గత 22 నెలలుగా వినిపించడం లేదు. కానీ ఆ సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్నడూ పైకి చెప్పడానికి ఇష్టపడవు కనుక బీజేపీయే దాని గురించి చెప్పుకోవలసి వస్తోంది. దేశాభివృద్ధి, దారిద్య నిర్మూలన, వంటివి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ‘కామన్’ గా వినబడే పదాలు. అవి ఇప్పుడు బీజేపీ హయాంలో మరికొంచెం గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఆ పదాలని కాంగ్రెస్, దాని మిత్ర ప్రక్షాలు, వామపక్షాలు ‘అప్రూవ్’ చేయడానికి ఇష్టపడటం లేదు. ఇష్టపడితే అవి ప్రతిపక్షంలో కూడా కనబడకుండా పోయే ప్రమాదం ఉంది కనుక ‘ఆ పాయింట్’ పై నుండి జనాల దృష్టిని డైవర్ట్ చేయడానికి ‘మత అసహనం’ అనే పదంపైనే ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉండేలా అవి జాగ్రత్తపడుతున్నాయి.
సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా అటువంటి ప్రయత్నమే చేశారు. ఆయన నిన్న ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్ధిక రంగంలో పూర్తిగా విఫలమయిన ఎన్డీఏ ప్రభుత్వం తన ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే దేశభక్తి, జాతీయవాదంపై చర్చకు తెర లేపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో దేశప్రజలలో చాలా ఆశలు రేకెత్తించగలిగారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి అంచనాలకు తగినట్లుగా దేశాభివృద్ధి చేయలేకపోతున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోనేందుకే బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లు కలిసి ‘దేశభక్తి, జాతీయతావాదం’ అనే అంశాలను చర్చంశానీయాలుగా మార్చేసాయి. అంతే కాదు లౌకికవాద దేశంగా ఉన్న భారత్ ని ఆ రెండూ కలిసి హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి,” అని ఆరోపించారు.
కేంద్రంలో ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపీ, ఆర్.ఎస్.ఎస్., వాటి అనుబంధ హిందూ సంస్థలు మళ్ళీ ఏక్టివ్ అయ్యాయనే ప్రతిపక్షాల వాదనలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రస్తుతం దేశంలో దేశభక్తి, జాతీయతావాదం అనే రెండు అంశాలపై చర్చ నడుస్తోందని సీతారం ఏచూరి చెప్పిన విషయం కూడా నిజమే. అయితే బీజేపీని దాని బలహీనత అయిన మతతత్వంపై దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్, దాని మిత్ర ప్రక్షాలు, వామపక్షాలు అన్నీ కలిసి ఊహాజనితమయిన ‘మత అసహనం’ అనే పదాన్ని సృష్టించి దానిని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తునప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవి చేస్తున్న ఈ దుష్ప్రచారం నుండి తనను కాపాడుకోనేందుకే దేశభక్తి, జాతీయతావాదంపై చర్చను ప్రారంభించి ఉండవచ్చునని అనుకోవచ్చును కదా?
బీజేపీ, ఆర్.ఎస్.ఎస్., వాటి అనుబంధ హిందూ సంస్థలు భారత్ ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని సీతారం ఏచూరి చేసిన ఆరోపణ నిజమే కావచ్చును. కానీ భారతదేశాన్ని అనేక శతాబ్దాలు పాటు పాలించిన మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు తమ తమ మతాలను దేశంలో వ్యాపింప జేయగాలిగారే కానీ భారత్ ని పూర్తిగా ముస్లిం దేశంగానో లేదా క్రీస్టియన్ దేశంగానో మార్చలేకపోయారు. అటువంటప్పుడు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లు 125 కోట్లు మంది ఉన్న భారత్ ని హిందూ దేశంగా మార్చగలవా? అంటే అది వాటి వలన సాధ్యం కాదనే సమాధానం వస్తుంది. ఒకవేళ ఆ రెండు అటువంటి ప్రయత్నాలు చేస్తే, ప్రజలు వాటిని తిరస్కరించడం తధ్యం కనుక అప్పుడు అవే నష్టపోతాయి.
కనుక కాంగ్రెస్, దాని మిత్ర ప్రక్షాలు, వామపక్షాలలో ఉన్న రాహుల్ గాంధి, సీతారం ఏచూరి వంటి వారు తమ తెలివితేటలను, వాదనా పటిమను ఉపయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభువ్తాలకు నిర్మాణాత్మకమయిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి వినియోగిస్తే దాని వలన వారికీ ప్రజలలో మంచి గుర్తింపు, గౌరవం దక్కుతాయి అలాగే దేశానికి ఏమయినా ప్రయోజనం చేకూరుతుంది. చివరిగా ఒక్క మాట ఏమిటంటే ఏ ప్రభుత్వానికయినా కొన్ని లోటుపాట్లు, బలహీనతలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి అవినీతి, కుంభకోణాలు బలహీనతలు అనుకొంటే, బీజేపీకి మతం బలహీనత. ఆ బలహీనతల వలన దేశానికి నష్టం జరుగుతోందని ప్రజలు నమ్మినప్పుడు వాటిని అధికారంలో నుండి నిదాక్షిన్యంగా దించేస్తుంటారని గుర్తుంచుకోవాలి.