“దేశభక్తి” అంటే ఏమిటి ?
ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన తల్లి భూమి భారతిని పొగడటం దేశభక్తి! ఎక్కడకు వెళ్లినా మన భారతీయుల్ని సోదర సమానంగా చూసుకోవడం దేశ భక్తి ! ఇతర దేశాల్లో ఇండియాను ఉన్నతంగా ఉంచడం దేశ భక్తి ! భారత్ ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశంగా నిలపడం దేశ భక్తి ! అభివృద్ధి ఎలా ఉన్నా మానుష్య విలువలు పాటించడంలో దేశ మిన్న అని చాటి చెప్పగలగడం దేశభక్తి ! .. నిజానికి తనకు దేశభక్తి ఉందని భారతీయులెవరూ బహిరంగంగా ఎప్పుడూ చెప్పుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ దేశభక్తి ఉంటుంది. నువ్ భారతీయుడివే.. నీ ఎదురుగా ఉన్న వాడు భారతీయుడే. ఒకరికొకరు దేశభక్తిని ప్రదర్శించుకోవడం అనవసరం. కానీ ఈ ప్రదర్శన హద్దులు దాటిపోయింది. అది దేశ భక్తి స్థాయిని దాటి దేశానికి నష్టం చేసే దిశగా వెళ్తోంది. దేశభక్తులకు బ్రాండ్ అంబాసిడర్ల పేరుతో ఉన్న కొంత మంది దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశాన్ని ఏకాకిని చేస్తున్నారు. ఇప్పుడు దేశానికి ఒక్క నిఖార్సైన మిత్రపక్షం ఉందా ?
ఒక్క మాటతో పశ్చిమాసియా దేశాలతో భారత్‌కు పెరిగిన దూరం !
భారత్‌కు పశ్చిమాసియా దేశాలు ఎంతో కీలకం. దేశ ఇంధన అవసరాలు మాత్రమే కాదు పాకిస్థాన్ ఎత్తుగడను చిత్తు చేసేందుకు పశ్చిమాసియాదేశాలతో స్నేహం, సహకారం ఎంతో కీలకం. ఆయా దేశాల నుంచి భారత్‌కు ఈ సహకారం ఎప్పటి నుండో ఉంది. కానీ.. నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లు మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఆ బంధాలను తెగతెంపులుచేసే పరిస్థితులు తెచ్చాయి. గల్ఫ్ దేశాలతో సఖ్యత కోసం దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రయత్నాలు వారి వల్ల బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ముస్లిం మత విశ్వాసాలు ప్రబలంగా ఉండే పశ్చిమాసియా దేశాలు ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను ఏ మాత్రం సహించలేకపోతున్నాయి. భారతీయ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తున్నాయి. మన దేశం నుంచి వెళ్లే కార్మికులకు వీసాల జారీని నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. గల్ఫ్ నుంచి వచ్చే పెట్టుబడులూ ఇక డౌటే. నిజానికి ఇవన్నీ భారత్‌కు ఎంత మద్దతుగా ఉండేవంటే.. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు చేసినప్పుడు ముస్లిం దేశాలు కొన్ని మాత్రమే భారత్‌కు వ్యతిరేకంగా స్పందించాయి. పాకిస్థాన్ మాటలను పట్టించుకోలేదు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టడంలో, ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందకుండా నిరోధించడంలో పలు గల్ఫ్ దేశాలు భారత్‌కు సహకరిస్తూ వస్తున్నాయి. మరికొన్ని తటస్థ వైఖరిని కనబరుస్తున్నాయి. ముస్లింల మనోభావాలను తాకేలా చేసిన వ్యాఖ్యలతో భారత్ పట్ల ఇప్పటి వరకూ సానుకూల వైఖరితో ఉండే అవకాశం లేదు.
బీజేపీ విధానపరమైన లోపాల వల్లే ఈ దుస్థితి !
“భారతీయులను సిగ్గుతో తలవంచుకునేలా ఏనాడూ చేయలేదు” అంటూ అధికారంలోకి వచ్చి ఎనిమిదేైండ్లెన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలే గొప్పగా ప్రకటించారు. అయితే, ఆయన పార్టీ నేతల వల్లే అంతర్జాతీయ సమాజం ముందు యావత్తు జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బతుకుదెరువు కోసం గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్‌లోని దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడి వారికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన దుర్గతి దాపురించింది. ఇది ముమ్మాటికీ బీజేపీ వల్లేని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజం విమర్శలు చేస్తోంది. ఓ వర్గం ఇళ్లను బల్డోజర్లతో కూల్చేయడం, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా విమర్శించిన ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులపై దేశద్రోహ కేసులు బనాయించడం, హలాల్, నమాజ్, మసీద్-మందిరం.. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలే రైట్‌వింగ్ గ్రూపులు విచ్చలవిడిగా మాట్లాడటానికి అవకాశాన్ని ఇచ్చాయి. నూపుర్, జిందాల్ వ్యాఖ్యలు ఇలాంటి వాతావరణంలో నుంచి వచ్చినవేననడంలో సందేహం లేదు. ముస్లిం జనాభాలో ప్రపంచంలో భారత్‌ది రెండోస్థానం. వారి ఓట్లు బీజేపీకి అవసరం లేదు. అయితే, ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక మతాన్ని కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. సొంత నేతలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నప్పటికీ ప్రధాని మోదీ, పార్టీ అధినేత నడ్డా ఉదాసీనతతో వ్యవహరిస్తూ వచ్చారు. ఫలితంగా అలాంటి వ్యాఖ్యలు చేసే వారు పెరిగిపోయారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిని సస్పెండ్ చేయగానే సమస్య సద్దుమణిగినట్టు బీజేపీ భావిస్తున్నది. కానీ పగిలిన గ్లాస్‌ను అతికించడం ఎంత కష్టమో.. ముస్లిం దేశాల తో సఖ్యను మళ్లీ పాత స్థాయిలో తెచ్చుకోవడం అంత కష్టం అన్న అభిప్రాయం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల్లో వినిపిస్తోంది.
యూరప్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి !
తమ బాధలు ప్రపంచం బాధలు అనుకుంటాయని.. ఆ మైండ్ సెట్ నుంచి యూరప్ దేశాలు బయటకు రావాలని ఇటీవల విదేశాంగ మంత్రి జై శంకర్.. యూరప్ దేశాలను కించ పరిచేలా వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారత్… తటస్థ వైఖరి ఇంకా చెప్పాలంటే రష్యా అనుకూల వైఖరి తీసుకుంది. ఈ విషయంలో యూరోపియన్ దేశాల నుంచి వస్తున్న అభ్యంతరాల విషయంలో జైశంకర్ ఇలా స్పందించారు. రష్యా నుంచి చములు కొనుగోలు విషయంలో .. భారత్ యూరోపియన్ దేశాల సూచలను పరిగణనలోకి తీసుకోలేదు. యూరోప్ దేశాలు పెద్ద ఎత్తున రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తూ తమను మాత్రం వద్దంటున్నాయని భారత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరప్ దేశాలు ఎంత మేర రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాయో కానీ.. ఇండియా మాత్రం ఇటీవల డిస్కౌంట్‌కు ఇస్తోంది కదా అని రష్యా దగ్గర పెద్ద మొత్తంలో ఆయిల్ కొంటోంది. అక్కడ్నుంచి ఇండియాకు తరలించుకొస్తోంది. అందుకే.. యూరప్ దేశాలపై కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఇప్పుడు యూరప్‌లో భారత్‌కు బలమైన మిత్రపక్షం ఉన్న దేశం ఏదీ అంటే… గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. భారత్ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు మార్చుకోవడంతో.. ఆ దేశాలన్నీ విధానాలకు తగ్గట్లుగానే భారత్‌తో ఉండాలన్న అభిప్రాయానికి వస్తున్నాయి.
రష్యా కోసం అమెరికా దగ్గర నమ్మకం లాస్ !
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న అమెరికాకు ఉక్రెయిన్ పరిణామాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. రష్యా చర్యను భారత్ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికాకు నచ్చలేదు. రష్యాతో మన దేశానికి మొదటి నుంచి ఉన్న సంబంధాలున్నాయి. ఆ దేశం ఎప్పటి నుంచో మనకు ప్రధాన ఆయుధాల సప్లయర్‌గా ఉంది. తాజగా చవకగా ఆయిల్ సరఫరా చేసుందుకు కూడా సిద్ధపడింది.. రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని భారత్ మీద అమెరికా చేసిన వత్తిడులు ఫలించలేదు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూ దీర్ఘకాలిక నమ్మకమైన భాగస్వామిగా చూడాలని అమెరికా భావిస్తోంది. ప్రచ్చన్న యుద్దం ముగిసిన ఈ మూడు దశాబ్దాలలో భారత్-అమెరికా మధ్య బంధం ఎంతో బలపడింది. భారత్ నాటో సభ్య దేశం కాకపోయినా ఆ స్థాయిలో తన మిలటరీ భాగస్వామిగా చేసుకుంది అమెరికా.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సైనిక లాజిస్టిక్స్ మార్పిడి, సురక్షిత సమాచార మార్పిడి కోసం అనేక ఒప్పందాలు కుదిరాయి. తాజా ప్యాకేజీ అమలైతే అమెరికా నుంచి ఇటువంటి సాయం అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రష్యా – ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణంలో రష్యాకే భారత్ సపోర్ట్ చేయడంతో భారత్‌పై అమెరికా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చు కానీ మనసులో పెట్టుకుంటుంది.చాన్స్ వచ్చినప్పుడు భారత్ ను ఖచ్చితంగా దెబ్బకొడుతుంది.
రష్యా అయినా నమ్మకమైన మిత్రపక్షమా ?
దేశం ఫస్ట్ అని ప్రపంచంలోని అన్ని దేశాధినేతలు చెబుతారు. అలాగే పుతిన్ కూడా చెబుతారు. కానీ ఆచరించే విషయంలో ఇతరులకు ఆయనకు చాలా తేడా ఉంటుంది. రష్యాకు ప్రపంచంలో మిత్రపక్షాలంటూ ఏవీ లేవు. కేవలం అవసరాలకు ఉపయోగపడే దేశాలు మాత్రమే సన్నిహితంగా ఉంటాయి. రష్యాకు అన్ని దేశాల కన్నా చైనా దగ్గర. భారత్‌కు సమస్య అంటూ వస్తే చైనాతోనే వస్తుంది. రేపు చైనాతో తలపడితే .. రష్యా ఎవరి పక్షం వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రష్యాకు ఎంతగా అండగా నిలిచినా చివరికి రష్యా చైనా పక్షమే. ఏ మాత్రం నమ్మదగిన మిత్రపక్షం కాదు రష్యా అనేది .. విదేశాంగ నిపుణులంతా చెప్పేమాట.
ఇరుగు పొరుగు దేశాలతో అవసరాల స్నేహమే తప్ప.. అనుబంధం లేదు !
చైనా గుప్పిట్లో భూటాన్ తప్ప పొరుగు దేశాలన్నీ అంటే. శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ అన్నీ ఉన్నాయి. హిందూ నేపాల్‌లో సైతం భారతీయుల పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఏమీ లేదు. తరచూ వివాదాలకు దిగుతోంది. కానీ చైనాకు దగ్గర. చైనా ఎంత చెబితే నేపాల్‌కు అంత దగ్గర. ఒక హిందూ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా మనతో నిలుపుకోలేనంతగా నేపాల్‌తో మన సంబంధాలు ముక్క చెక్కలు ఎందుకు అయ్యాయి? శ్రీలంక ఇప్పుడు దివాలా స్థితిలో ఉంది. నిజానికి ఆ దేశ పాలకులకు చైనానే ఇష్టం. ఆ విషంయ అందరికీ తెలుసు. మన దేశం నుంచి వచ్చే సాయం కోసం.. కృతజ్ఞతలు చెబుతారు కానీ.. ఏ విషయంలోనూ సహరించరు.. సమర్థించరు. ఇక పాకిస్థాన్ సంగతి సరే సరి. చైనా శత్రువుగా మారి చాలా కాలం అయింది. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, ఆ భయాన్ని కొనసాగిస్తూనే… విధేయులుగా చేసుకోవడంలో విఫలమయ్యాయి. భారత్ ఎవరి జోలికి వెళ్లదు. తన పని తాను చేసుకుంటుంది. అందుకే… సాత్విక దేశంగానే ప్రపంచంలో భారత్‌కు పేరు ఉంది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పొరుగు దేశాలు… చిచ్చు పెట్టే అగ్రదేశాల మధ్య కూడా… ఇన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో వెళ్తోంది. కానీ ఓ వైపు నుంచి నేపాల్ మన భుభాగాల్ని కలిపేసుకుని మ్యాప్‌లు విడుదల చేస్తోంది. మరో వైపు నుంచి చైనా సైనికుల్ని చంపేస్తోంది. పాకిస్తాన్ ఏ కుట్రలు చేస్తుందో కూడా తెలియడం లేదు. శ్రీలంకతోనూ అంతంతమాత్రమే సన్నిహిత సంబంధాలు. ఈ దేశాలన్నింటి వెను చైనా ఉందన్నది బహిరంగ రహస్యం. ఒక్క భూటాన్ మాత్రమే ప్రస్తుతం మన ఇరుగు పొరుగులో మనకు నిఖార్సైన మిత్రపక్షం. అవసరాలను బట్టి ఇతర దేశాలు తమ విధాలను మార్చుకుంటూ ఉంటాయి.
రాజకీయాలు కాదు దేశానికి మంచి చేయాల్సిన సమయం !
మంచి చేయకపోయినా పర్వాలేదు.. చెడు మాత్రం చేయవద్దన్న ఓ నానుడి ని ఇప్పుడు మనం గుర్తుచేసుకోవచ్చు. దేశభక్తి పేరుతో దేశానికి మేలు చేయకపోయినా పరవాలేదు కానీ కీడు చేయకూడదు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు కీడు జరుగుతోంది.ఎవరు ప్రశ్నించినా వారిపై ఎదురుదాడికామన్ అయిపోయింది. అది దేశమా.. రాష్ట్రమా.. బయట దేశాలా అన్నది కాదు.. మొత్తంగా ఎదురుదాడి చేయడమే టార్గెట్ అయిపోయింది. కానీ దేశానికి జరుగుతున్ నష్టం మాత్రం గుర్తించలేకపోతున్నారు. అవన్నీ గుర్తించి … తమను తము రైట్ ట్రాక్‌లో పెట్టుకున్నప్పుడే.. నిజమైనదేశభక్తి బయటపడుతుంది. లేకపోతే.. దేశానికి నష్టం చేసినట్లే. .!