“దేశభక్తి అనేది జెండా ఊపడంలో కాదు, మన దేశం ధర్మబద్ధంగా మరియు బలంగా ఉండాలని ప్రయత్నించడంలో ఉంటుంది.” ..
నూట యాభై ఏళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన జేమ్స్ బ్రిస్ అనే పెద్దాయన ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలకు తెలుగు అనువాదం ఇది. మన వైతాళికులు కూడా ఇలాంటివి చాలా చెప్పారు. ” దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ ” అని ఐదంటే ఐదు పదాల్లో గురజాడ వారు చెప్పిన మాటలో ఎన్నో అర్థాలు లేవు. డైరక్ట్ మీనింగ్ ఒకటే ఉంది. నువ్వు.. నేను.. మనం.. భారతీయులందరం కలిస్తే భారతదేశం. “మానవత్వమే దేశభక్తి ” అని మహాత్ముడు ఎన్నో సార్లు చెబుతారు. వీటిని ఎవరూ ఖండించారు. అందరూ అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు ఆ దేశ భక్తిని రాజకీయ సరుకుగా మార్చేశారు. ఓ ఎమోషనల్ గేమ్‌గా మార్చేశారు. తాము చెప్పినట్లుగా చేయకపోతే దేశద్రోహులన్నముద్ర వేస్తామన్నట్లుగా తేల్చేశారు. అందుకే దేశభక్తి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలు దేశం కోసం ప్రజలు ఏం చేయాలి ? పాలకులు ఏం చేయాలి ? అనే చర్చను లేవనెత్తుతోంది.
జెండా ఎగరేద్దాం.. దేశభక్తి గీతాలు పాడుదాం… దేశభక్తిలో ఛాంపియన్లేమేనా ?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వజ్రోత్సవ వేడుకలకు పిలుపునిచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలున్న చోట .. వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పేరు మార్చేసినా… అంతా తామే చేస్తున్నామన్న ముద్ర కనిపించడానికి స్వయంగా కార్యక్రమాల రూపకల్పన చేశారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఓ జాతీయ జెండా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటిపై ఎగరాలంటున్నారు. అందరూ ఎగరేస్తున్నారు. ప్రభుత్వం జెండా సరఫరా చేసిన ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా కనిపిస్తోంది. ఆగస్టు మూడో వారం వరకూ భారీ ఎత్తున పాటల ప్రోగ్రాంలు నిర్వహింప చేస్తారు. పాటల పోటీలు పెడతారు. ఆసక్తి ఉన్న వారంతా ప్రదర్శన చేస్తారు. ఇత అంతేనా దేశభక్తి.. ! ఇవన్నీ చేసిన వాళ్లేనా వీరభక్తులు ! దేశభక్తికి అర్థం ఇదేనా ?
దేశభక్తి అంటే దేశాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడం !
దేశభక్తి అంటే నినాదం కాదు; దేశభక్తి అంటే రాజకీయం కోసం రగిల్చే ఉద్వేగం కాదు; దేశభక్తి అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం అంతకంటే కాదు. దేశభక్తి అంటే ఎన్నికల ముడిసరుకు కానేకాదు. దేశభక్తి అంటే జన్మభూమితో భూమి పుత్రుడికి ఉండే దైవికమైన అనుబంధం. దేశ మాతపై ఉండే పుత్ర ప్రేమ. పుట్టిన ప్రాంతంపై ఉండే పితృ ప్రేమ. ఆర్థిక అంతరాలు దేశాన్ని నిలువునా రెండుగా విభజిస్తున్నాయి. నిత్యం సకల సౌకర్యాలతో విలసిల్లే వర్గం ఒకటి ఉంటే.. కనీస సౌకర్యాలకు నోచుకోని బడుగుల జీవితాలూ ఇంకా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారు. మరో 25 కోట్ల మందికి అక్షర జ్ఞానం కూడా లేదు. ఇవన్నీ కేంద్రం చెప్పిన లెక్కలే. 75 ఏళ్ల తర్వాత మనం చాతి విరుచుకునేలా చేసుకునే లెక్కలేనా ఇవి. దేశం అభివృద్ధి చెందుతోంది.. కానీ.. ఆ అభివృద్ధి అన్ని వర్గాలకూ చేరాలి.. దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది.. ఆ ప్రగతి ఫలాలు అందరికీ అందాలి.. సకల సౌకర్యాల భారతం.. అందరికీ కావాలి.. అందరం బావుండాలి.. అందులో మనం ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందా ? రాజకీయ నాయకులు అదే లక్ష్యంగా పని చేస్తున్నారా ?
చాన్స్ వస్తే పరాయిదేశం వెళ్లి బతకాలని ప్రతి ఒక్కరూ అనుకునే స్థితే దేశభక్తా ?
దేశంలో డబ్బులు సంపాదించుకున్న కుబేరులు పరాయిదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కాస్త చదువుకుంటున్న పిల్లలను మీ లక్ష్యం ఏమిటని అడిగితే.. అమెరికా అనే చెబుతారు. అమెరికా కాకపోతే ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. లండన్ అంటారు కానీ.. దేశంలోనే ఉంటాను అనుకునేవారు తక్కువ. ఇప్పటికి 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాటవాలను విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు. భారత పౌరులకు అమెరికాలో గ్రీన్‌కార్డు దొరికితే.. ఆ పిల్లలు ఫోన్ చేసి ‘అమ్మా నాకు గ్రీన్ కార్డు వచ్చింది’ అని చెప్తే, ఇక్కడ తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారిని పిలిచి పార్టీలు చేసుకుంటున్నారు. అంటే… వారికి దేశభక్తి లేదని కాదు. కానీ ఇక్కడి కంటే మెరుగ్గా అక్కడ బతగలగమని వారు భావించడమే . ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడూ సహజంగా దేశభక్తి కలిగి వుంటాడు. బాగా అభివృద్ధి చెందిన అమెరికాకో, బ్రిటన్‌కో, ఆస్ట్రేలియాకో పోయి అక్కడే స్థిరపడి పోయిన వారు గాని, స్థిర పడిపోదామని అనుకుంటున్న వారు గాని ఈ దేశం పట్ల ద్వేషంతో ఉండరు. మహా అయితే ఇక్కడి అవినీతినో, వెనకబాటుతనాన్నో తిట్టుకోవచ్చు. అంతమాత్రాన వారెవరికీ దేశభక్తి, మాతృదేశం మీద అభిమానం లేవని అనలేం. వారి దృక్పధంలో దేశభక్తి వేరు.. జీవించడం వేరు. అమెరికాలో లక్షల మంది ఉన్నా.. భారత్ పై వారి భక్తి అలాగే ఉంటుంది.కానీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఆ భారతీయులందర్నీ మన దేశంలోనే ఎందుకు ఉంచుకోలేకపోయాం.. ఇప్పటికీ ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం.. అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. ఇక్కడ వారి ప్రతిభకు తగ్గ ప్రయోజనం లభించడం లేదు. దేశంలో అలాంటి పరిస్థితి లేదు. దేశంలో కుబేరులు అయి ఉండి.. ప్రతీ చిన్న పనికి పని వాళ్లు ఉన్నా… సరే చాలా మంది అమెరికా పోయి ఇక్కడి ఆస్తులన్నీ వదిలేసి.. అక్కడ అన్నీ పనులు చేసుకుంటూ కష్టపడి బతికేస్తూంటారు. ఎందుకంటే తమ బతుకుల్ని అక్కడ బతకనిస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏల్లకు కూడా ఇంకా రాలేదు.
75 ఏళ్లలో అసమానతలు తగ్గకపోగా.. బ్రహ్మరాక్షసిగా మారాయి !
మన దేశ ప్రజలలో అన్ని వర్ణాలున్నాయి. వేల సంవత్సరాల క్రితం నుండి మనుగడ కోసం ఇక్కడికి వివిధ జాతులు వచ్చాయి. అలాగే వేల సంఖ్యలో ఈ దేశంలో కులాలు వున్నాయి. ఈ దేశంలోని భిన్నత్వం బహుముఖంగా విస్తరించి వుంది. ఆహారపుటలవాట్లలో చాలా తేడా వుంటుంది. శాకాహారులు మాత్రమే జాతీయతకు ప్రతినిధులు అని గాని, ఆవు మాంసం తింటే వారికి దేశభక్తి లేదని గాని చెప్పడం ఎంత దారుణం. అలాంటి పరిస్థితి అంతకంతకూ పెరుగుతోంది. ఎవరు ఏ తిండి తినాలి.. ఎవరు ఏ బట్టలు కట్టుకోవాలో కూడా డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఫలానా తిండే తినాలి! ఫలానా పద్ధతి లోనే దుస్తులు ధరించాలి; ఫలానా పాటే పాడాలి; ఫలానా ఆటే ఆడాలి; సినిమా ఫలానా విధంగానే తీయాలి; అని శాసించడం దేశభక్తి కాదు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భావనకి రూపమే మన జాతీయతా స్ఫూర్తి. ఒకే దేశం-ఒకే జాతి-ఒకే భాష-ఒకే తిండి- ఒకే మతం-ఇది జాతీయత కాదు; దేశభక్తి అంతకన్నా కాదు. ఇప్పుడు దేశంలో ధనికవర్గం ఉంది. మధ్యతరగతి వర్గం ఉంది. నిరుపేద వర్గం ఉంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ధనికవర్గం .పేద వర్గాలు మాత్రమే ఉన్నాయి.రోజువారీ జీవితం దుర్లభమై ప్రతీ రోజూ వందల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది. సమాజనంలో అసమానతలు పెరిగిపోయాయి. పేదవాడుమరింత పేదవాడవుతున్నాడు. ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు.
దేశానికి పట్టిన దరిద్రం రాజకీయమే !
రాజకీయం అంటే ఓ బూతు అయిపోయింది. రాజకీయ నాయకులను ఎవరైనా రాజకీయం చేస్తున్నారా అంటే…లేదు లేదే మేం రాజకీ యం చేయడం లేదంటారు. ప్రజాసేవ చేస్తున్నామంటారు .రాజకీయం లో ప్రజాసేవ భాగం అని వారు అనుకోరు. రాజకీయం అంటే మోసం..కుళ్లు, కుట్ర ..కుతంత్రాలు అనుకుంటారు. నిజానికి రాజకీయం అంటే దేశాన్ని బాగు చేయడం. ప్రజల బతుకుల్ని మెరుగ్గా తీర్చిదిద్దడం. కానీ మన దేశంలో రాజకీయం అంటే.. అధికారాన్ని దక్కించుకోవడం.. అనుభవించడం మాత్రమే. ఇందు కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టడం దగ్గర్నుంచి అన్నీ రకాల చంఢాలాలు రాజకీయ పార్టీలుచేస్తున్నాయి. కులం, మతం , ప్రాంతం పేరుతోరచ్చ చేసి.. దేశ ప్రజలమధ్య విభజన తెచ్చేస్తున్నారు. మాట్లాడిదే దేశభక్తి కానీ చేసేది మాత్రం నిఖార్సుగా దేశద్రోహమే. 75 ఏళ్ల కిందట చైనా పరిస్థితులు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి. భారతదేశ వ్యవసాయ భూమితో పోలిస్తే చైనా వ్యవసాయ భూమి దాదాపు సగం మాత్రమే. కానీ, అక్కడి వ్యవసాయ ఉత్పత్తులు మనతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. అమెరికాలో నాలుగు రెట్లు ఎక్కువ. మనం ఎందుకు వారిలా పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టి, యంత్రాల శక్తిని తగినంతగా వినియోగించుకోలేకపోతున్నాం? మరిన్ని ఉపాధి అవకాశాలను, సంపదను ఎందుకు సృష్టించుకోలేకపోతున్నాం? ఇవన్నీ ఆలోచించే రాజకీయం రావాలి. నిజానికి అదే దేశభక్తి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు దేశభక్తి రాజకీయం అయిపోయింది. డీపీలు మార్చుకోండి.. జెండాలు ఎగురవేయండి అని ఈవెంట్లు నిర్వహించే వరకూ వచ్చింది.
దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్డడమే అసలైన దేశభక్తి !
‘భారత దేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను…’ అంటూ పాఠశాలల్లో విద్యార్థులు రోజూ ప్రతిజ్ఞ చేస్తారు. ‘జనగణమన’ జాతీయ గీతం. ‘వందేమాతరం’ మన జాతీయోద్యమంలో ఒక నినాదం. భారత దేశాన్ని ‘దేశమాత’గా ఆరాధిస్తాం. మాతృదేశం అంటాం. కొన్ని దేశాల ప్రజలు ఫాదర్ ల్యాండ్ అంటారు. వారి దేశభక్తి కూడా తక్కువేమీ కాదు. జాతీయ పక్షి, జాతీయ జంతువు… ఇలాంటి చిహ్నాలు మన దేశ ప్రజలలో వెల్లివిరిసిన జాతీయతా భావానికి సంకేతాలు. వీటన్నింటికీ పరాకాష్టగా జాతీయ జెండా ఉంది. గాలిలో ఆ జెండా రెపరెపలాడుతుంటే మన హృదయాల్లో ఒక ఉత్తేజం ఉప్పొంగుతుంది. ఏదిఏమైనా దేశభక్తి ఎవరో చెబితేనో, ఏదో చేస్తేనో వచ్చేదైతే కాదు. మహా అయితే ఆవేశం, ఉత్సాహం ఆ క్షణానికి “జై హింద్” అంటే వస్తుందేమోగానీ, క్రియాశీలక దేశభక్తి నిర్థిష్టమైన మానవత్వం నుంచీ వస్తుంది. దేశభక్తిని రాజకీయం చేసే నేతలు గుర్తించాల్సింది అదే. దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే దేశభక్తి. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టడం.. రాజకీయ అవసరాలు తీర్చుకోవడం దేశద్రోహమే అవుతుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తించి.. నిఖార్సుగా దేశం కోసం దేశభక్తిని ప్రదర్శిస్తాయో.. అప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లుగా అనుకోవాలి.
జైహింద్ !