ఈ సంక్రాంతి సినిమా `సరిలేరు.. నీకెవ్వరు` సెన్సార్పూర్తయ్యింది. నిడివి ప్రకారం చూస్తే పెద్ద సినిమానే. కాకపోతే మహేష్ బాబు సినిమా కదా, మూడు గంటలైనా చూడ్డానికి ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఈ సినిమాలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, పాటలూ.. అన్నీ వర్కవుట్ అయ్యాట. క్లైమాక్స్ కూడా బాగా వచ్చిందని తెలుస్తోంది.
మహేష్ – అనిల్ రావిపూడి సినిమా కాబట్టి, యాక్షన్తో పాటు కామెడీ ఆశిస్తారు. అయితే ఇందులో ఓ కోర్ పాయింట్ ఉంది. కథకు మూలం అదే. దేశభక్తికి అసలైన అర్థం చెప్పే ప్రయత్నం చేశారిందులో. దేశం కోసం, సరిహద్దుల్లో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి కాపాల కాస్తుంటే, కొంతమంది మాత్రం ఆ త్యాగాల్ని అపహాస్యం చేస్తూ, దేశంలోపల అరాచకాల్ని సృష్టిస్తున్నారని, అలాంటివాళ్లని బోర్డర్లో పడేయాలని, దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్లకు కళ్లారా చూపించాలని – `సరిలేరు` సందేశం ఇవ్వబోతోందట. దేశభక్తి అంటే ఆగస్టు 15నో, జనవరి 26నో జాతీయ పతాకానికి సెట్యూట్ చేయడం కాదని, అంతకు మించిన త్యాగాలెన్నో చేయాలని యువతకు పిలుపు ఇస్తున్నార్ట. వీటికి సంబంధించిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయని, దేశభక్తి కోణం బాగా చూపించగలిగారని తెలుస్తోంది. సో…అన్ని కమర్షియల్ విలువలతో పాటు దేశభక్తిని కూడా బాగానే జోడించారన్నమాట. ఈ సందేశం కూడా జనాలకు చేరితే – చిత్రబృందం శ్రమ ఫలించినట్టే.