పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి తరలింపు మొదలైంది. కృష్ణా తూర్పుడెల్టా (కృష్ణా జిల్లా) లో నాట్లు వేసుకోడానికి ఈ నీరు చాలా వరకూ ఉపయోగపడుతోంది. అయితే, కష్ణా పశ్చిమ డెల్టా (గుంటూరు జిల్లా) కు విడుదలయ్యే నీటి పరిణామాన్ని చూస్తూ వరి పంటకు నీరు చాలదని రైతులు ఆందోళన పడుతున్నారు. పదిహేను రోజులపాటు కనీసం 5000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా 1000 క్యూసెక్కులు మాత్రమే అందుతోంది. ఇపుడు అందుతున్న కృష్ణా డెల్టాకు ఇపుడు అందుతున్న గోదావరి నీళ్ళలో 80 శాతం కృష్ణాజిల్లాకు, 20 శాతం గుంటూరు జిల్లాకు మళ్ళిస్తున్నారు.
రాయలసీమ కోసమే పట్టిసీమ నీళ్ళని నినాదాలు ఇచ్చి, 14 మీటర్ల నీరున్నపుడుమాత్రమే ఎత్తిపోస్తామన్న హామీని పక్కన పెట్టి, రెండు కష్ణా డెల్టాలకు కూడా నీరు ఇవ్వలేక సతమతమౌతూ, విజయవంతంగా నదీ అనుసంధానం చేశామని పదేపదే చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వ ధోరణి చూస్తూంటే ”వెర్రికుదిరింది రోకలి తలకు చుట్టండి” అన్నట్టు వుంది.
పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణా పశ్చిమ డెల్టాకు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో గుంటూరు జిల్లా రైతులు అయోమయంలో చిక్కుకున్నారు. అరకొరగా విడుదలవుతున్న నీటి ద్వారా నాట్లు ఎప్పుడు వేయాలో తెలియక గందరగోళ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా జూలై 15 నాటికే ఈ డెల్టా కింద నారుమళ్లకు నీళ్లివలసి ఉంది. ఇప్పటికి పది రోజులు గడిచాయి. పట్టిసీమ నుంచి 8200 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని అధికారులు తొలుత అంచనా వేయగా సోమవారం సాయంత్రానికి 4600 క్యూసెక్కులే ప్రకాశం బ్యారేజికి చేరాయి. ఇందులో 3385 క్యూసెక్కులు కృష్ణా జిల్లా పరిధిలోని తూర్పు డెల్టాకు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టాకు 1016 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. దీంతో చివరి భూములకు నీరు చేరడం కష్టతరంగా మారింది. డెల్టా పరిధిలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా నెలలో ఎక్కువ కాలం కురవకపోవడం వల్ల ఇప్పటి వరకూ రైతులు ఎక్కువ మంది నారుమళ్లు పోయలేకపోయారు.
జిల్లాలో సాధారణంగా వరి విస్తీర్ణం 6.25 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకూ వెయ్యి ఎకరాల్లో కూడా నాట్లు పూర్తి కాలేదు. పట్టిసీమ నుండి నీరు విడుదల చేసి 15 రోజులు దాటినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు రాకపోవడంతో నేటికీ చాలా మంది రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కాలేకపోతున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టాకు నెల పాటు కనీసం రోజుకు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో నీరురాకపోవడం, చాలీచాలని వర్షాలతో నాట్లు వేసేందుకు జిల్లా రైతులు తటపటాయిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో బ్యాంకు కెనాల్‌కు 2200 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంటే కేవలం 150 క్యూసెక్కులు, కొమ్మమూరు కాల్వకు 3600 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా 203 క్యూసెక్కులు విడుదల చేశారు. నిజాంపట్నం కాల్వకు వెయ్యి క్యూసెక్కులకు గాను 150 మాత్రమే విడుదల చేస్తున్నారు.
ఇతర జిల్లాలకు భిన్నంగా గుంటూరు జిల్లాలో ఆగస్టు చివరి వరకు వరినాట్లు వేస్తారని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో రబీలోనూ వరి వేసే అవకాశం ఉందని గుంటూరు జిల్లాలో ఏడాదికి ఒక్క పంట మాత్రమే వరి వేస్తారని, దీని వల్ల ప్రభుత్వం కృష్ణా జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గుంటూరు జిల్లాలో వరినాట్లు వేసుకునేందుకు మరో 15 రోజులు వేచిచూసినా ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లాలోనూ ఆగస్టు 15 కల్లా వరినాట్లు పూర్తికాకపోతే రబీ పంటగా అపరాలు, మొక్కజొన్న వంటి పంటలు వేయడంలో తీవ్ర జాప్యమవుతుందని రైతులు చెబుతున్నారు.
అయితే, పులిచింతల రిజర్వాయిర్ లో రెండున్నర టిఎంసిల నీరు దాచివుంచారు. దీన్ని పుష్కరాల సమయంలో పుణ్యస్నానాలకోసం విడుదల చేస్తారు.