హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటే కావటానికి కొద్ది సేపటిక్రితం విజయవాడ చేరుకున్నారు. పవన్ ఇవాళ విలక్షణంగా, తెల్ల లుంగీ, తెల్ల షర్ట్ ధరించి ఉండటం విశేషం. ఏపీ వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి పవన్ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. పవన్ మిత్రుడు, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాత శరత్ మరార్ కూడా ఆయన వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, రైతులపై సానుభూతితోనే విజయవాడ వెళుతున్నానని చెప్పారు. చంద్రబాబుతో ఏ ఏ అంశాలపై మాట్లాడేది ఇప్పుడే చెప్పలేనని పవన్ అన్నారు. మర్యాదపూర్వక భేటీగానే చూడాలని, కలసి చాలా రోజులయిందని కలుస్తున్నానని చెప్పారు. ఉదయం 11.30 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. చంద్రబాబుతో మాట్లాడాక అన్ని విషయాలూ చెబుతానన్నారు. భేటీ గంటన్నరపాటు జరిగే అవకాశముందని, మధ్యాహ్నం 2 గంటలకు ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడతారని చెబుతున్నారు. మరోవైపు కామినేని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు, చంద్రబాబుకు ఒకరంటే ఒకరికి చాలా గౌరవం ఉందని, అసెంబ్లీ ఎన్నికలలో ఏ ప్రతిఫలమూ ఆశించకుండా టీడీపీ-బీజేపీ విజయానికి పవన్ పనిచేశారని గుర్తుచేశారు. గన్నవరం విమానాశ్రయంవద్ద, సీఎం క్యాంప్ కార్యాలయంవద్ద పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు.
పవన్ చంద్రబాబుతో ఏ విషయాలపై చర్చిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో భూ సేకరణ, రాజధాని నిర్మాణం, రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా వంటి విషయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపైకూడా ఇరునేతలూ చర్చించే అవకాశముందని అంటున్నారు. జనసేన ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందినందున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఇప్పటికే విజయవాడలో సీఎమ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఉండటంతో పవన్-బాబు భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, టీడీపీ-జనసేన పొత్తు అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు.