వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. అన్ని పద్దతులు బాగుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. త్రిముఖ పోరులో బలి అవడానికి సిద్ధంగా లేనని ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని ప్రకటించారు. టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదు.. మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలి.. అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, బెబ్బులిలా తిరగబడాలని పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇప్పుడు సీఎం సీటు వచ్చే తీరాలి.. కానీ సీట్లు లేవప్పుడు ఏం చేయగలం..? ఓ ప్రాంతానికే పరిమితం అయిన ఎంఐఎంకు ఏడు స్థానాలు వస్తాయి.. రాజకీయాల్లో తన ప్రభావం చూపుతోంది.. కానీ జనసేనకు కనీసం 10 స్థానాలైనా రాకుంటే ఎలా..? ఎంఐఎంలా కాదు.. కనీసం విజయకాంత్ లా కూడా మనల్ని గెలిపించలేదన్నారు. అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అంటే ఎందుకు భయం.. నేను మాట్లాడగానే వైసీపీ బుడతలు వచ్చి మాట్లాడతారు.. వైసీపీ బుడతలను సీఎంను చేయవచ్చు కదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అభిమానం ఓట్లుగా మారితేనే సీఎం అవుతారు.. అజాత శత్రువును కాను.. కొంత మందికి నన్ను శత్రువుగా చూసినా ఓకే.. నన్ను ఎంత విమర్శిస్తే.. అంతగా రాటుతేలుతానన్నారు. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ వల్ల అయిందేమో.. కానీ, నా వల్ల అవుతుందని నేను ఏనాడూ భావించలేదు. నినాదాలు చేస్తేనో.. గజ మాలలు వేస్తేనో.. సీఎం కాలేరు.. ఓట్లేస్తేనే సీఎం అవుతారని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ గుర్తోస్తాడేమో..? మోసం చేసే వాళ్లే జనానికి నచ్చుతారేమో..? అయినా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం.. ఈ రాష్ట్రం కోసం నేను నిలబడతానని పవన్ స్పష్టం చేశారు.
పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ బలమైన మెజార్టీతో గెలుస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల తక్కువ అంచనా వేయవద్దన్నారు. సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామన్నారు. పొత్తులపై విధివిధానాలు త్వరలో తేలుతాయని స్పష్టం చేశారు.