ఆక్వాఫుడ్ పార్క్ పంచాయితీ జనసేన నేత పవన్ కల్యాణ్ దగ్గరకి వచ్చింది! శనివారంనాడు తుందుర్రు రైతులు హైదరాబాద్ వచ్చి, పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వల్ల తాము ఎన్నిరకాలుగా నష్టపోతున్నామో పవన్‌కి వివరించారు. పార్క్‌ను వ్యతిరేకిస్తే తమపై కేసులు పెడుతున్నారనీ, ఇంటి ముందు పోలీసులను పెడుతున్నారనీ, ఇంట్లోంచి బయటకి వస్తే ఆధార్ కార్డు చూపించాలని ఆంక్షలు పెడుతున్నారనీ.. ఇలా రైతులు పవన్ ముందు వాపోయారు. రైతుల గోడు విన్న తరువాత పవన్ కల్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు సర్కారు వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. బాధల్ని చెప్పుకునేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్క్ వ్యవహారంపై ఒక కమిటీ వేసి దర్యాప్తు చేయాలన్నారు. లాభాల పేరుతో నిబంధనలను గాలికి వదిలేస్తే ఊరుకునే పరిస్థితి లేదనీ, శాంతియుతంగా ఉద్యమించాల్సి వస్తుందని కూడా పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుందుర్రును మరో నందిగ్రామ్ చెయ్యొద్దని, ఆక్వా రైతులకు జనసేన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
జరిగింది ఇదీ..! గతంతో మాదిరిగానే ఇప్పుడూ జరుగుతోంది. అదేంటంటే… ఈ ఆక్వాఫుడ్ పార్క్ విషయమై రైతుల సమస్యలు తెలుసుకునేందుక ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి కూడా కార్యాచరణ ప్రకటించారు. తుందుర్రు వెళ్లబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ ఇష్యూలోకి పవన్ కల్యాణ్ వచ్చారు. కీలకమైన ప్రజా సమస్యలపై ప్రతిపక్షం పోరాటం ప్రారంభించేలోపుగానే పవన్ కల్యాణ్ తెరమీదికి వచ్చేస్తున్నారని చెప్పుకోవాలి. గతంలో రాజధాని రైతుల భూముల విషయంలో కూడా ఇలానే జరిగింది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్న ఆరోపణలు వినిపించాయి. రైతులు కూడా రోడ్డెక్కారు. మూడు పంటలు పడే భూముల్ని చంద్రబాబు సర్కారు లాక్కుంటోందనీ, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఇష్యూలో కూడా ప్రతిపక్ష పార్టీ వైకాపా స్పందించినా… ఫోకస్ మొత్తం పవన్ కల్యాణ్ మీదికే వెళ్లిపోయింది.
రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలకు పవన్ కల్యాణ్ వెళ్లడం, భూములు లాక్కుంటే ఊరుకోను.. ఉద్యమిస్తా అంటూ చంద్రబాబుకు హెచ్చరికలు చేయడంతో జనసేనానివైపే జనం కూడా చూశారు. ఇప్పుడు, ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేకత కూడా రాజధాని రైతుల సమస్య అంత పెద్దదే. ఈ సందర్భంలో రైతుల పక్షాన ప్రతిపక్షం పోరాడుతుంది అని చెప్పేలోపే.. ఎలాగైతేనేం ఇష్యూ పవన్ కల్యాణ్ దగ్గరకి వచ్చేసింది. సహజంగానే మీడియా ఫోకస్ కూడా ఇప్పుడు పవన్ చుట్టూనే ఉంటుంది. ఆక్వాఫుడ్ పార్క్‌పై పవన్ పోరాటం చేస్తారా… మరోసారి చంద్రబాబుతో ఢీ కొంటారా… ఇలాంటి కథనాలకే ప్రాధాన్యత ఉంటుంది.
ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనకబడుతోందా… లేదా, పవన్ కల్యాణ్‌ను ఎవరైనా ముందుకు తెస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అత్యధిక జనాభాను ప్రభావితం చేసే సమస్య తెరమీదికి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ప్రతిపక్షం కంటే ముందు జనసేన తెరమీదికి వస్తూ ఉండటం కాకతాళీయమా..?