‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక హోదాతో సహా అన్ని అంశాలపైనా కేంద్రంతో రాజీపడిపోయారు. ఏపీ సమస్యలపై ఇంతవరకూ ఒక అఖిల పక్షం కూడా పెట్టలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరా’.. కొన్నాళ్ల కిందట ప్రతిపక్ష వైకాపా నేతల విమర్శ ఇది. ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా అఖిల పక్షం గురించి గత నెలలోనే మాట్లాడారు. కేంద్రంపై జగన్ అవిశ్వాసం పెడితే, తాను మద్దతు కూడగడతా అంటూ సిద్ధమైన సందర్భంలో ఆయన మాట్లాడుతూ… విభజన సమస్యలపై ఏపీ ఎంపీలు అందరూ పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలీ, పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలీ, అఖిల పక్షం ఏర్పాటు చేస్తే దానికి జనసేనతోపాటు వైసీపీ కూడా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అన్ని పార్టీలనూ ఆహ్వానించారు. వైకాపా రాలేదు, పవన్ కూడా రాలేదు. కానీ, పవన్ తో కలిసి కార్యాచరణకు సిద్ధమైన వామపక్షాల నేతలు ఈ సమావేశానికి వచ్చారు. వైకాపా ఎందుకు రాలేదనేది ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో చెప్పారు. ఈ అఖిల పక్షానికి చిత్తుశుద్ధి లేదూ, దాన్ని నిర్వహించే చంద్రబాబుకీ చిత్తశుద్ధి లేదూ, అందుకే మేం వెళ్లలేదు అన్నారు. పవన్ రాకపోవడానికి కారణం ఏంటంటే.. ఇంత త్వరగా సమావేశం అని పిలిస్తే ఎలా, కొంత సమయం ఉండాలి కదా అని వ్యాఖ్యానించారట. అయితే, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయనీ, అందుకే అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందనీ, ఈ విషయమై ఎవ్వరూ ఇగోలకు వెళ్లొద్దనీ, రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి మాత్రమే ఆలోచించి సమావేశానికి రావాలని కోరానని కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే చంద్రబాబు అఖిల పక్షం పెట్టడం లేదని వైకాపా చాలా విమర్శించింది. తీరా సమావేశం పెడితే ఇవాళ్ల డుమ్మా కొట్టారు. అఖిలపక్షం పెట్టరా అంటూ ప్రశ్నించినవారే .. ఇవాళ్ల దానికి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలీ, ఢిల్లీకి కలిసి వెళ్లాలని కోరినవారే.. ఈ సమావేశానికి రాకపోవడంతో చిత్తశుద్ధి లేమి ఎవరిదో ప్రజలకు ఇట్టే అర్థమౌతోంది కదా..!