లోకేష్ ఈ వారాంతంలోగా యువగళం పాదయాత్ర ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కేసు విషయాలను చూసుకోవడానికి పూర్తిగా న్యాయకోవిదులతో పాటు పార్టీపరంగా ఓ టీమును ఏర్పాటు చేసి.. తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ పరమైన వ్యవహారాలకు లోటు రాకుండా జాగ్రత్త పడాలనుకుటున్నారు. మరో వైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన తన నాలుగో విడత వారాహి యాత్రను ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
ఈ సారి కృష్ణా జిల్లాలో యాత్ర సాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు.
గతంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు.. ఓ వైపు లోకేష్ పాదయాత్ర.. మరో వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సాగుతూ ఉండేవి. ఇక ఏపీలో వైసీపీ లేదా అన్నట్లుగా ఉండేది. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా జగన్ విపక్షాల రాజకీయ సన్నద్దతను దెబ్బకొట్టే ప్లాన్ వేశారు. కానీ అది ఒకందుకు.. బాగా ఉపయోగించుకున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఇప్పుడు ఒక్కటిగా అయ్యారు. యాత్రలు కూడా వేర్వేరుగా అయినా ఒకే సారి.. జనాల్లో ఉండబోతున్నారు. ఈ సారి యాత్రలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయి.