జనసేన హడావిడి జనాలకు పెద్దగా కనిపించడం లేదుకానీ తెరవెనుక మాత్రం చాలా తతంగమే నడిపిస్తున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్. జనసేనకు నమ్మకస్తులైన కార్యకర్తలను తయారు చేయడంతో పాటు నాయకులతోనూ రాయబారాలు నడుపుతున్నట్టున్నాడు పవన్. ఒక నాయకుడి విషయంలో ఇప్పుడు చాలా గొప్ప విజయం సాధించాడు పవన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణాలో కాలుమోపడం అనేది సీమాంధ్ర నాయకుడికి అసాధ్యం అన్న మాట వాస్తవం. తెరాస కంటే ఎక్కువగా కార్యకర్తల బలమున్న టిడిపినే అక్కడ చేతులెత్తేసింది. ఓటుకు నోటు కేసు తర్వాత నుంచీ తెలంగాణా టిడిపి పరిస్థితి గాలిలో దీపమైంది. ఇక వైకాపా అధినేత జగన్ ఎప్పుడో గుడారం ఎత్తేశాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చూస్తూ ఉంటే మాత్రం జనసేనకు తెలంగాణాలో కూడా అస్తిత్వం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నాయకుడిగా గద్దర సత్తా ఎంత అనే విషయం గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఆ గద్దర్ కోసం ఎన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారో తెలుసుకోవాలి. 2014 ఎన్నికలకు ముందే గద్దర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇక అలాంటి అవకాశం ఉన్న మిగిలిన పార్టీలు కూడా ఓ ప్రయత్నం చేశాయి. అలాగే గద్దర్ సపోర్ట్ కోసం కెసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు. కానీ గద్దర్ మాత్రం ఉద్యమ బాట వదిలి రాజకీయ అరంగేట్రం చేయడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ నాయకులు, కెసీఆర్‌కి సాధ్యం కానిదాన్ని పవన్ సాధించినట్టుగా కనిపిస్తోంది. గద్దర్ మాటలు చూస్తూ ఉంటే జనసేనలో చేరడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా జనసేన పార్టీని ప్రశంశిస్తూ మాట్లాడాడు గద్దర్. పవన్ కళ్యాణ్ ఎలాగూ సీమాంధ్రకు పరిమితం అవడం ఖాయం. తెలంగాణా జనసేన విభాగానికి గద్దర్‌లాంటి నేత నాయకత్వం వహిస్తే మాత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తారు? ఏం చే్స్తారు? అనే విషయాలను పక్కన పెడితే అస్థిత్వానికి మాత్రం ఢోకా ఉండదు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు సానుభూతిపరులు, గద్దర్ అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. అన్నింటికీ మించి జంపింగ్ జపాంగ్స్లాంటి డబ్బున్న అవినీతి నాయకుల కంటే కూడా గద్దర్ లాంటి నాయకుడు పార్టీలో చేరితే మాత్రం సిద్ధాంతపరంగా పార్టీకి బలమే అవుతుంది. అలాగే సినిమావాళ్ళను ఆదరించే అలవాటు సీమాంధ్రలో ఉన్నంతగా తెలంగాణాలో లేదు. గద్దర్ చేరికతో సినిమా వాళ్ళ పార్టీ అన్న ముద్ర కూడా చాలా వరకూ చెరిగిపోయే అవకాశం ఉంది. ముందు ముందు ఈ స్నేహితుల రాజకీయ పయనం ఎలా ఉంటుందో చూడాలి మరి.