రాయలసీమ పర్యటనలో పూర్తిగా కొత్త పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు. సహజంగా ఆయనలో ఆవేశం ఉంటుంది కానీ.. రాయలసీమ పర్యటనలో.. ఆ ఆవేశం స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. ప్రభుత్వంపై విరుచుకుపడే విషయంలో.. ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం లేదు. తన విమర్శలు సూటిగా.. సుత్తి లేకుండా ఉండేలా చూసుకుంటున్నారు. పర్యటన ప్రారంభమైన కడప నుంచే.. పవన్ కల్యాణ్… వైసీపీ మార్క్ రాజకీయాలకు.. తనదైన కౌంటర్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా లాంటి కడప జిల్లాలో తొలి రోజు పవన్ కల్యాణ్ తొడకొట్టినంత పని చేశారు. జగన్ మోహన్ రెడ్డి కొందరికే సీఎం అని బహిరంగంగా ప్రకటించారు. ఆయన అందరి వాడు కాదన్నారు. అంతే కాదు.. ప్రభుత్వం తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. అక్కడి ప్రజలు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.
పవన్ కల్యాణ్ ఈ రోజు.. కడపతోనే సరిపెట్టలేదు. దాదాపుగా ప్రతీ రోజూ.. వైసీపీ పాలనపై… జగన్ తీరుపై.. తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇందులో ఎలాంటి అతిశయోక్తులకు అవకాశం ఉండటం లేదు. ఓ సందర్భంలో తాను అసలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని ప్రకటించేశారు. ఇది అనూహ్యం. ఈ పరిస్థితిని ఊహించలేకపోయిన వైసీపీ నేతలు… వరుసగా ప్రెస్ మీట్లు.. పెట్టి.. పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు. వ్యక్తిగత, కులపరమైన విమర్శలు చేసి.. తన ఈగోను సంతృప్తి పరుచుకున్నారు. కానీ పవన్ కల్యాణ్.. వీటిని పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వంపై తన పోరాటంపై దృష్టి పెట్టారు.
సీమలో పవన్ పర్యటనకు వస్తున్న స్పందన.. ఆయన చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి వెళ్తూండటంతో.. ఆయన టూర్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. తిరుపతిలో ఉల్లి మార్కెట్‌కు వెళ్లి.. ప్రభుత్వ పనితీరును ఆయన బయట పెట్టారు. ప్రజలకు కేజీ ఉల్లి పాతిక రూపాయలకే ఇస్తున్నామని పబ్లిసిటీ చేసుకుంటున్న ప్రభుత్వం.. తిరుపతి నగరం మొత్తానికి ఒకే ఒక్క కౌంటర్ పెట్టింది. ఆ కౌంటర్ దగ్గర.. ఎనిమిది గంటలు నిలబడితే.. ఒక్క కేజీ ఉల్లిపాయలు లభిస్తున్నాయి. ప్రజలతో ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆడుకుంటుందో.. పవన్ కల్యాణ్ బయట పెట్టారు. ఈ రోజు ఆయన మదనపల్లి టమాటో మార్కెట్‌కు వెళ్లాలనుకున్నారు. కానీ పర్మిషన్ లేదంటూ పోలీసులు కొత్త సాకులు చెప్పడం ప్రారంభించారు. కానీ మార్కెట్ కు వెళ్లడానికి పర్మిషన్లేంటని పవన్.. ముందుకే వెళ్లబోతున్నారు.