పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. `విరూపాక్ష` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని లెక్కేసింది. అయితే.. ఈ సినిమా లక్ష్యం మారింది. పాన్ ఇండియా సినిమాగా దీన్ని చిత్రబృందం భావించడం లేదట. తెలుగు సినిమాగానే తీయాలని ఫిక్స్ అయ్యిందని సమాచారం. తెలుగులో తీసి, మిగిలిన భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని భావిస్తోంది. హిందీ నాట కూడా డబ్బింగ్ సినిమానే వెళ్తుంది. అక్కడ థియేటరికల్ రిలీజ్ ఉండకపోవొచ్చు. పాన్ ఇండియా సినిమాలు ఈమధ్య బోల్తా పడుతున్నాయి. హిందీ కోసం, మిగిలిన భాషల కోసం కథలో మార్పులు చేర్పులు చేసి, స్టార్ కాస్టింగ్ని తీసుకొచ్చి భంగపడుతున్నారు. దాని వల్ల బడ్జెట్ పెరుగుతోంది తప్ప, పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అందుకే పవన్ సినిమాని తెలుగు భాషకే పరిమితం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలున్నారు. అందులో ఒకర్ని బాలీవుడ్ నుంచి దిగుమతి చేద్దామనుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కూడా మారింది.