భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పోటీ చేసే రెండు స్థానాలూ ఉత్తరాంధ్ర, గోదావరి ప్రాంతాల నుంచి ఎంచుకోవడం విశేషం! మేధావులతో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారమే పవన్ ఈ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారని ప్రకటించారు. అయితే, సామాజిక వర్గాల ప్రభావం పరంగా చూసుకుంటే… ఆ పరిస్థితిని కూడా అంచనా వేసే సదరు కమిటీ ఈ స్థానాలను పవన్ పోటీకి ఆప్షన్లుగా ఎంపిక చేసిందా అనే అభిప్రాయం కలుగుతోంది
భీమవరంలో సాధారణంగా రాజులను పోటీకి దించాలని పార్టీలు అనుకుంటాయి. కానీ, పవన్ స్వయంగా బరిలోకి దిగుతున్నారు. 2004, 2009, 2014… ఈ మూడు సార్వత్రిక ఎన్నికలను వరుసగా ఒక్కసారి వెనక్కి తిరగేసి చూస్తే… ఈ నియోజక వర్గంలో మూడుసార్లూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే గెలిచిన పరిస్థితి ఉంది! అంతకుముందు ఓ రెండుసార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు గెలిచిన సందర్భాలున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన తరువాత కూడా కాపు సామాజిక వర్గం సంఖ్యే అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇక, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండో నియోజక వర్గం గాజువాకలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ కూడా వారి సంఖ్యే ఎక్కువ. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అక్కడ అప్పట్లో బాగా బలంగా ఉండేది. ఆ నియోజక వర్గంలో లక్షకుపైగా సభ్యత్వాలు నమోదయ్యాయి అంటున్నారు!
విశ్లేషాత్మకంగా చూసుకుంటే… ఈ సానుకూల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఈ రెండు స్థానాలనూ పవన్ ఎంచుకున్నారా అనే అభిప్రాయం సహజంగానే కలుగుతుంది. అయితే, ఈ నియోజకవర్గాల ఎంపిక తన నిర్ణయం కాదనీ, కమిటీకే తుది నిర్ణయం వదిలేశానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. సరే, నిర్ణయం ఏదైనా ఎవరిదైనా భీమవరం, గాజువాకల నేపథ్యమైతే అది. ఇక్కడే పవన్ పోటీకి ఎందుకు దిగుతున్నారా అని ఆలోచించేవారికి… ముందుగా కంటికి కనిపించే చరిత్ర అది! సామాజిక వర్గాల ముద్రకు అతీతంగా జనసేన పార్టీని అందరికీ చేరువ చెయ్యాలన్నది పవన్ లక్ష్యం అనడంలో సందేహం లేదు. అయితే, ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పవన్ నిర్ణయాలు ఉంటే… ఆ లక్ష్యంపై ఇతర చర్చలకు ఆస్కారం లేని పరిస్థితి ఉంటుంది.