పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై జనసేన అధినేత పవన్ సమాచారం ఎలా సేకరించారో కానీ … జనసేన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మూడింతలు మెరుగుపడిందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. పంచాయతీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు 27 శాతం ఓటింగ్ నమోదయిందని ఆయన ప్రకటించారు. ఈ ఇరవై ఏడు శాతం బీజేపీతో కలిశా లేకపోతే.. ఒక్క జనసేననా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ గురించి అసలు తన ఆన్లైన్ ప్రెస్మీట్లో ప్రస్తావించలేదు కాబట్టి ఒక్క జనసేన ఓట్లుగానే భావించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆరు అంటే ఆరు మాత్రమే ఓట్లు వచ్చాయి. రాజోలులో మాత్రం ఎమ్మెల్యే గెలిచారు.
ఆయన కూడా పవన్ కల్యాణ్‌ను అవమానించి జగన్ కే జైకొట్టారు. అయితే..పవన్ కు మద్దతిచ్చే సామాజికవర్గం ఎక్కువుగా ఉన్న జనసేన పంచాయతీలు గెల్చుకుంది. పవన్ చెప్పినంతగా 1209 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలిచారో లేదో ఎవరికీ స్పష్టత లేదు. ఏ మీడియా కూడా… అంత పెద్ద స్థాయిలో జనసేనకు పంచాయతీలు లభించాయని చెప్పలేదు. పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి.. ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. 1209 పంచాయతీల్లో గెలవడమే కాదు.. 65 శాతం పంచాయతీలలో ద్వితీయస్థానంలో నిలిచామని… అధికార మదంతో రక్తసిక్తం చేసినా..జనసైనికులు బలంగా నిలబడ్డారని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
జనసేన విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు సంకేతమని .. గ్రామాలలో కొత్త నాయకత్వం రావాల్సి ఉందని పవన్‌కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన బలం ఎంత ఉందో.. పట్టణాల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా తేలిపోతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల వారీగానే ఎన్నికలు జరుగుతాయి. ఈ కారణంగా ఎవరు గెలిచారో స్పష్టత వస్తుంది.ఎవరి బలమేంటో తెలిపోతుంది.