పవన్ రీ ఎంట్రీతో అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఒకటా, రెండా.. ఏకంగా మూడు సినిమాలు. ఇప్పటికే రెండు సినిమాలకు కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు మూడో సినిమాకూడా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. `పింక్` విడుదలైన తరవాత.. పవన్ ఈ సినిమాపై దృష్టి పెడతారు. పవన్ ఒకేసారి మూడు సినిమాల్ని ఒప్పుకోవడం, మూడు సినిమాల్లోనూ పవన్ వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం… మూడూ పెద్ద బ్యానర్లే కావడం ఆనందించాల్సిన విషయమే. పవన్ మాత్రం ఈ సినిమాలకు తీసుకున్న పారితోషికం సంగతులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఆ అంకెలు కాస్త షాకింగ్‌కి గురి చేస్తున్నాయి.
మైత్రీ మూవీస్ దగ్గర, ఏఎంరత్నం దగ్గర పవన్ అడ్వాన్సులు తీసుకున్నాడు. వాళ్లకు ఓ సినిమా చేయాల్సిన అవసరం పవన్‌పై ఉంది. ఎప్పటి నుంచో ఈ రెండు సంస్థల్నీ ఊరిస్తూ వచ్చాడు పవన్. వీళ్లకంటే ముందు దిల్‌రాజుకి కమిట్మెంట్ ఇచ్చి మిగిలిన ఇద్దరు నిర్మాతల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రోజుకి ఇంత అని.. దిల్ రాజు పారితోషికం ఇవ్వడానికి ముందుకు రావడం, ఆ అంకె పవన్‌ని టెమ్ట్ చేయడంతో – `పింక్` సినిమా పట్టాలెక్కేసింది. ఈసినిమాతో పవన్ దాదాపు 40 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పవన్ రీ ఎంట్రీ, అందులోనూ ఓ రీమేక్ సినిమా, పైగా 20 రోజుల కాల్షీట్లు.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నా 40 కోట్ల పారితోషికం అన్నది చాలా ఎక్కువ.
ఇప్పుడు దిల్‌రాజు ఇచ్చిన అంకెని చూపించే – అటు ఏఎంరత్నం దగ్గర, ఇటు మైత్రీ మూవీస్ దగ్గర మరింత పారితోషికం డిమండ్ చేస్తున్నట్టు ఇండ్రస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. రత్నం నుంచి పవన్ దాదాపు 20 కోట్లు అడ్వాన్సుగా అందుకున్నాడు. ఇది ఇప్పటి మాట కాదు. రెండు మూడు సంవత్సరాల క్రితం. ఆ 20 కోట్లకూ పవన్ సినిమా చేసి పెట్టాలి. కానీ దిల్ రాజు ఇచ్చిన అంకెల్ని చూపించి – ఏఎం రత్నం దగ్గర మరింత పెద్ద మొత్తంలో పారితోషికన్ని డిమాండ్ చేసినట్టు, పవన్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఏ.ఎం.రత్నం కూడా అన్యమస్కంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే ట్రిక్ మైత్రీ మూవీస్ దగ్గరా ప్లే చేశాడట పవన్. పవన్ పారితోషికం 25 నుంచి 30 కోట్ల లోపు ఫిక్స్ చేసింది మైత్రీ. ఇది వరకే అడ్వాన్సు తీసుకున్నాడు కాబట్టి పవన్ కూడా ఇదే మొత్తానికి సినిమాచేస్తాడని మైత్రీ నిర్మాతలు భావించారు. కానీ దిల్ రాజు సినిమాకి 40 కోట్ల పారితోషికం ఇచ్చారని, ఈ సినిమాకీ అదే స్థాయిలో ఇవ్వాలని పవన్ అడిగినట్టు, చివరికి మైత్రీ ఒప్పుకోవాల్సివచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మూడు సినిమాల ద్వారా దాదాపుగా 120 కోట్లు పారితోషికం ఆర్జించబోతున్నాడు పవన్. ఇందులో ఇది వరకు తీసుకున్న అడ్వాన్సులు మినహాయించుకోవాలి.